కోటీ 50 లక్షల ఎకరాలు.. 5,608 కోట్ల చెక్కులు

కోటీ 50 లక్షల ఎకరాలు.. 5,608 కోట్ల చెక్కులు

పొలం ఉన్నా వ్యవసాయం చేసే ఆర్థిక స్థోమత లేని రైతుల కోసం రైతు బంధు పథకాన్ని ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. రైతుకు ముందస్తు పెట్టుబడి సమకూర్చడం ప్రపంచంలోనే తొలిసారి అని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ రంగంలో ఇది చరిత్రాత్మక మలుపని అంటున్నారు.  ఈనెల10వ తేదీన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ధర్మరాజు పల్లి నుంచి ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ఈ గ్రామరైతులు మొదట పట్టాదార్ పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులను అందుకోనున్నారు. 
రాష్ట్రంలో మొత్తం 1.40.98.486 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. తొలివిడతగా 58 లక్షల మందికి 5608 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం అందజేయనున్నారు. మొత్తం 10,663 గ్రామాల్లో రోజుకు 1546 గ్రామాల చొప్పున చెక్కులు అందజేస్తారు. పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి 2 విడతలలో ఎకరానికి రూ.8వేల పంట సాయాన్ని ప్రభుత్వం ఇవ్వనున్నది. 
నేరుగా రైతు చేతికే చెక్కును అందిస్తారు.అనారోగ్యంతో ఉండే రైతులకు సంబంధిత అధికారి నేరుగా ఇంటికే వెళ్లి ఆ చెక్కును అందిస్తారు. ఇక.. కొంతమంది రైతులకు బ్యాంకు ఖాతాలతో  ఆధార్ సీడింగ్ జరగలేదు. అటువంటివారికి ఆధార్ జెరాక్స్ అందిస్తే చెక్కు అందజేయాలని నిర్ణయించారు. మరోవైపు.. పెట్టుబడి చెక్కుల సొమ్ము పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో సొమ్ము నిల్వ ఉంచింది. 
రాష్ట్రంలో..
సన్నకారు రైతులు 41 లక్షల మంది
2.5 నుంచి 5 ఎకరాల భుమి ఉన్న రైతులు 11 లక్షల మంది
5 నుంచి 10 ఎకరాలున్న రైతులు 4 లక్షల 44 వేల మంది 
10 నుంచి 25 ఎకరాలున్న రైతులు 94,551
25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు 6488