నేటి నుంచి 'రైతుబంధు'

నేటి నుంచి 'రైతుబంధు'

తెలంగాణ రాష్ట్రంలో  రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ శ్రీకారం చుడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద జరిగే కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు పథకాన్ని ప్రారంభిస్తారు. సీఎం ప్రారంభించిన అనంతరం ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల్లోనూ చెక్కులను పంపిణీ చేస్తారు.నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొంటారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 58.33 లక్షల మంది రైతులకు సంబంధించిన సుమారు 1,43,27,000 ఎకరాల సాగుభూమికి పంట సాయం అందనుంది. రూ.5,730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను రాష్ట్రవ్యాప్తంగా 10,833 గ్రామాల్లో పంపిణీ చేస్తారు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి-ఇందిరానగర్ వద్ద లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.