దేశానికి దిక్సూచి మనమే: కేసీఆర్‌

దేశానికి దిక్సూచి మనమే: కేసీఆర్‌

రైతుబంధు పథకంతో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. భారతదేశంలోనే ఇవాళ సువర్ణ అధ్యాయమన్నారు. వ్యవసాయం బాగుండాలంటే భూముండాలి, నీళ్లుండాలి, కరెంట్ ఉండాలని.. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. రైతు బంధు పథకం కోసం బడ్జెట్‌లో 12 వేల కోట్లు కేటాయించామని చెప్పిన కేసీఆర్‌.. బంగారు పంటలు పండించాలని రైతులను కోరారు. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని నిరూపించాలన్నారు.
హేళనగా మాట్లాడారు..
తెలంగాణ వస్తే చీకట్లే అని హేళన చేశారని, ఇప్పుడు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 2014 ముందు కరెంటు ఉంటే వార్త అని ఇప్పుడు పోతే వార్త అని వివరించారు. కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు నీరివ్వడమే తన లక్ష్యమని, అప్పటి దాకా నిద్రపోనని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వద్దంటున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కాళేశ్వరం నీళ్లతో మూడు పంటలు పండించుకోబోతున్నామని కేసీఆర్‌ చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్నీ వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్‌.. ఇప్పుడున్న ధరలో నాలుగో వంతు పెంచి మద్దతు ధర చెల్లించాలని కోరారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర అందాలని, అన్ని పంటలకూ మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 
భారీగా ఒళ్లున్నా... 
 ఆంధ్రా నాయకుల తొత్తులుగా ఉండి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవసాయాన్ని నాశనం చేశారని సీఎం విమర్శించారు. ఆనాడు నోరు మూసుకున్న నాయకులు నేడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని  మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటే ఒక్కరు కూడా కిక్కురమనేలేదని కేసీఆర్‌ అన్నారు. తమ పార్టీ నేతలంతా సన్నగా.. బక్కగా ఉన్న పెద్ద పనులు చేస్తున్నామని..  కాంగ్రెస్‌ నేతలకు భారీగా ఒళ్లున్నా... బుద్ధిలేదని విమర్శించారు.
ప్రతిఇంటికీ నల్లా ..
నిధులు దుర్వినియోగం కావొద్దని, డబ్బు రైతులకే అందాలని కేసీఆర్‌ సూచించారు. టీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామని.. రైతులకు బీమా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని  పునరుద్ఘాటించారు. జూన్ 2 నుంచి రైతులకు రూ.5 లక్షల బీమా అమలు చేస్తామని చెప్పారు. రెండు, మూడు నెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు.