బ్యాంకులకు 'రైతుబంధు' టెన్షన్‌

బ్యాంకులకు 'రైతుబంధు' టెన్షన్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతుల్లో ఆనందం నింపుతుండగా బ్యాంకులకు మాత్రం టెన్షన్‌ పట్టుకుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 58.33 లక్షల మంది రైతులకు రూ.5,750 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. రైతులకు పంపిణీ చేసేందుకుగానూ రాష్ట్రంలోని వివిధ బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాదాపు రూ.5750 కోట్లను పంపించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు రూ.466 కోట్లు పంపించింది. ఇందుకు సంబంధించిన చెక్కులు రైతులకు ఒకేసారి ఇవ్వకుండా 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దశలవారీగా ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. రిజర్వ్‌ బ్యాంకు పంపించిన నగదు రైతుబంధు పథకానికి తప్ప ఇతర లావాదేవీలకు ఉపయోగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు అధికారుల్లో టెన్షన్‌ పట్టుకుంది. వారం రోజులపాటు ఇంత డబ్బును ఎలా నిల్వ చేయాలా అని ఆలోచనలో పడ్డారు అధికారులు. కొన్ని జిల్లల్లో అంతపెద్ద మొత్తంలో నగదును ఎక్కడ భద్రపరచాలో కూడా తెలియని సందిగ్ధావస్థ ఏర్పడింది. మరోవైపు.. గ్రామాల్లో బ్యాంకులకు పటిష్ఠ భద్రత నడుమ నగదు చేర్చారు. బ్యాంకుల వారీగా ముద్రించిన చెక్కులు, పంపిణీ చేయనున్న నోట్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పంపించింది. భారీ స్థాయిలో నగదు నిల్వలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకూ సూచనలిచ్చింది.