ప్రేమించిన వ్యక్తి కోసం వచ్చి జైలు పాలైంది

ప్రేమించిన వ్యక్తి కోసం వచ్చి జైలు పాలైంది

ప్రేమించిన వ్యక్తి కోసం సౌదీ నుంచి వచ్చిన యువతి అతడిని పెళ్లి చేసుకుని చివరకు జైలు పాలైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సౌదీ అరేబియా దేశం నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించిందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సౌదీలో ఓ బడా కుటుంబానికి చెందిన అల్‌ హర్బీ అనే యువతి.. భారతీయుడైన తన కారు డ్రైవరు అజీముద్దీన్ తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ప్రేమ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ప్రియుడ్ని వెతుకుతూ భారత్ వచ్చింది ఆ యువతి.

సౌదీలోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వివాహం చేసుకోవడం కుదరదని భావించారు. ఈ ఏడాది జనవరిలో అజీముద్దీన్‌ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం ఇతడి కుటుంబం నిజామాబాద్‌లో నివసిస్తోంది. తిరిగి వచ్చినప్పటికీ అల్‌ హర్బీకి..అజీముద్దీన్‌కి మధ్య చాటింగ్స్, ఫోన్‌కాల్స్‌ కొనసాగాయి. అతడిపై ఉన్న ప్రేమను చంపుకోలేనని భావించిన యువతి ఇక్కడకు వచ్చి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సౌదీలోని తన ఇంటి నుంచి, అదే చిరునామాతో వీసాకు దరఖాస్తు చేస్తే విచారణ నిమిత్తం అధికారులు రావడం, సంప్రదింపుల నేపథ్యంలో విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భావించింది. అదే జరిగితే తనను భారత్‌కు వెళ్లనీయరని, అజీముద్దీన్‌ను వివాహం చేసుకోవడం సాధ్యం కాదని భావించిన ఆమె గత నెల విహారయాత్రకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటికి వచ్చి నేపాల్‌కు చేరుకుంది.

 

అక్కడ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. రోడ్డు, రైలు మార్గాల్లో నిజామాబాద్‌ వెళ్లి అజీముద్దీన్‌ను కలుసుకుంది. వివాహం చేసుకున్న వీరిద్దరూ కాపురం పెట్టారు. అల్‌ హర్బీ తాను తన ప్రియుడి కోసం అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించానని, వివాహం చేసుకున్న నేపథ్యంలో నిజామాబాద్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంది. దీంతోపాటే తాను మేజర్‌నని నిరూపించే, తమకు వివాహమైనట్లు ధ్రువీకరించే పత్రాలు జత చేసింది. ఆమె కోసం గాలింపు చేపట్టిన కుటుంబసభ్యులు ఆమె తెలంగాణకు చేరుకుందని తెలుసుకుని, సౌదీ అధికారులను ఆశ్రయించగా, వారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ దృష్టికి విషయం తీసుకువెళ్లారు. 

 

పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించగా తాను ఇష్టపూర్వకంగానే వచ్చానని, ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని అప్పట్లోనే యువతి స్పష్టం చేసింది...దీంతో కుటుంబీకులు ఏమీ చేయలేక వెనుదిరిగిపోయారు...తీరా ప్రేమించిన వ్యక్తితో కలిసి నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్టలో నివాసం ఉంటోంది. మన దేశంలోకి యువతి అక్రమంగా చొరబడిన కారణంగా పోలీసులు ఆ యువతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 7వ తేదీన యువతిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారాన్ని అందించినట్లు పోలీసులు తెలిపారు. జైలు విడుదల కాగానే ఆ యువతిని సౌదీ అరేబియాకు పంపిస్తామని అధికారులు అంటున్నారు.