ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు: జూపూడి

ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు: జూపూడి

ఇంటి బయట దొరికిన డబ్బులతో నాకు ఎలాంటి సంబంధం లేదని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మహాకూటమిని విజయం వైపు తీసుకెళ్లడానికి వచ్చాను.. వైసీపీ, టీఆర్ఎస్ పోలీసులు వచ్చి సోదాలు చేస్తారా అని మండిపడ్డారు. నాలుగు దఫాలుగా సోదాలు చేశారు ఏమి దొరకలేదు. బయట దొరికిన డబ్బులతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దళితులు అంటే లెక్కలేకుండా పోయింది. మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండన్నారు. నిన్న  ఉదయం నుండి నా వెనకాల పోలీసులు.. వారి వెనకాలే టీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతున్నారు. వారి పార్టీ వారికి ముఖ్యం అయితే.. మా పార్టీ మాకు ముఖ్యం కాదా? అని జూపూడి ప్రశ్నించారు. నా ఇల్లు ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. నాపేరు ప్రతిష్టలకు భంగం కలిగించారు. వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.

బుధవారం రాత్రి కూకట్ పల్లి బాలాజీ నగర్ లో ఆంధ్రప్రదేశ్ ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో జూపూడి ఇంటి వెనుక నుండి డబ్బు మూటలతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. పారిపోతున్న వారి నుంచి పోలీసులు 17.50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. జూపూడి ఇంటిదగ్గర డబ్బులు దొరకడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూపూడి ప్రభాకర్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.