నేతల్లో స్వలాభం పెరిగింది: పవన్‌

నేతల్లో స్వలాభం పెరిగింది: పవన్‌

జాతీయ జెండాకు కులం, మతం, ప్రాంతం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. అతిపెద్ద జాతీయ జెండాను ఇవాళ హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతిఒక్కరిదీ అని అన్నారు. జెండాలోని కాషాయ రంగు అంటే హిందూ మతానికి సంబంధించిన కాదని అన్నారు. కాషాయం ఉన్నతమైన రంగు అని, కాషాయం వేసేవారు సర్వసంగ పరిత్యాగులై ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మూడు రంగులూ జాతి సమైక్యతకు చిహ్నమని వివరించారు. ప్రస్తుత రాజకీయాలు స్వలాభం చుట్టూ తిరుగుతున్నాయని.. ఇటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమం పెట్టడం అభినందనీయమని పవన్‌ అన్నారు. ' జెండా ఎత్తితే ఉవ్వెత్తున ఎగసిపడే గుండె ధైర్యం.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మగౌరవ నినాదం రెపరెపలాడుతుంది' అంటూ ఉద్విగ్నంగా ప్రసంగించారు. దేశభక్తి ప్రతిజ్ఞను మన నాయకులు మర్చిపోయినా.. యువత విద్యర్థులు మరవలేదని చెబుతూ.. జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.