స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా... మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. 13 పాయింట్ల లాభంతో 10,834 వద్ద ప్రారంభమైన నిఫ్టికి 10,850 వద్దే ప్రతిఘటన ఎదురైంది. అక్కడి నుంచి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మిడ్‌ సెషన్‌ కల్లా నిఫ్టి10,739కి పడిపోయింది. యూరో మార్కెట్ల ఓపెనింగ్‌ తరువాత కోలుకుని క్లోజింగ్‌ కల్లా 10,810కి చేరింది. చివరి కొద్ది నిమిషాల్లో లాభాల స్వీకరణతో 10,794 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 26 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ ప్రధానంగా ఐటీ షేర్లు బాగా దెబ్బతీశాయి. టీసీఎస్‌ కౌంటర్లో భారీ లాభాల స్వీకరణతో షేర్‌ రూ. 50లకు పైగా నష్టపోయింది. చివర్లో రూ.46 నష్టంతో రూ. 1842 వద్ద ముగిసింది. ఇవాళ సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌ కూడా ఒకదశలో రూ. 672కి పడిపోయినా... చివర్లో కోలుకుని రూ. 683 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 3.8 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు స్వల్ప లాభంతో ట్రేడవుతుండగా, డాలర్‌ స్థిరంగా ఉంది.  యూరో మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. నష్టాలు వచ్చినా.. చాలా స్వల్పంగా ఉన్నాయి. ఇవాళ నిఫ్టిలో 34 షేర్లు నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన టాటా మోటార్స్‌ కౌంటర్‌లో ఇవాళ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ్టి టాప్‌ గెయినర్‌ ఐటీసీ. తరువాతి స్థానాల్లో యూపీఎల్‌, విప్రో,ఐఓసీ, హిందాల్కో ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ షేర్‌ తో పాటు టాటా మోటార్స్‌ మూడు శాతం క్షీణించాయి. ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు రెండు శాతం నష్టంతో ముగిశాయి. ఇతర షేర్లలో ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ 9 శాతం లాభంతో క్లోజైంది.