నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఒకదశలో 80 పాయింట్ల దాకా నష్టపోయిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరువాత కోలుకుని 39 పాయింట్ల నష్టంతో 10,922 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసినా.. వృద్ధి రేటుపై  వచ్చిన వార్తలతో  ఉదయం  ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. తరువాత కోలుకున్నా... నష్టాలు ఒక శాతంపైనే ఉన్నాయి. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు మాత్రం ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం భారీగా నష్టపోయిన రూపాయి తరువాత కోలుకుంది. దీనికి క్రూడ్‌ ధరలు క్షీణించడమే కారణం. ఇవాళ మెటల్‌ షేర్ల సూచీ రెండు శాతం పైగా నష్టపోయింది. టాటా స్టీల్‌ వంటి షేర్లు 54 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. అలాగే మీడియా షేర్లు తగ్గాయి. ఇక లాభపడిన షేర్ల సూచీలలో ఫార్మా, రియాల్టి ఉన్నాయి. ఆకాశరామన్న ఉత్తరం కారణంగా గత వారాంతంలో రూ. 382కు పడిపోయిన సన్‌ ఫార్మా షేర్‌ ఇవాళ రూ. 417 వద్ద ముగిసింది. నిఫ్టి షేర్లలో విప్రో కూడా మూడు శాతం పెరగ్గా, టైటాన్‌, కొటక్‌ బ్యాంక్‌ రెండు శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఒకటిన్నర శాతం పెరిగాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో వేదాంత, టాటా స్టీల్‌ ముందున్నాయి. ఈ రెండు షేర్లు మూడు శాతంపైగా నష్టపోయాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు రెండు శాతం నుంచి మూడు శాతం వరకు నష్టపోయాయి. ఇతర ప్రధాన షేర్లలో ప్రభాత్‌ డెయిరీ షేర్‌ 15 శాతం క్షీణించింది.