అత్యంత గొప్ప న్యాయమూర్తుల్లో ఒకరు

అత్యంత గొప్ప న్యాయమూర్తుల్లో ఒకరు

సుప్రీం కోర్టు న్యాయమూర్తి  జాస్తి చలమేశ్వర్‌కు ప్రముఖ  న్యాయవాది శాంతి భూషణ్‌ ఘనంగా వీడ్కోలు పలికారు. కోర్టు నం.2 లో ఇవాళ లంచ్‌కు న్యాయమూర్తి లేస్తున్న సమయంలో శాంతి భూషణ్ కల్పించుకుని మాట్లాడారు. సుప్రీం కోర్టు తయారు చేసిన అత్యంత గొప్ప న్యాయమూర్తుల్లో జాస్తి చలమేశర్వర్‌ ఒకరని కొనియాడారు. సుప్రీం కోర్టులో జస్టిస్‌ చలమేశ్వర్‌కు ఇదే చివరి పనిదినం. రేపు ఆయన రిటైర్‌ అవుతున్నారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ ధైర్యం, ప్రవర్తన, న్యాయ దృష్టి, ముక్కుసూటితనాన్ని శాంతి భూషణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మాజీ జస్టిస్‌ హెచ్ ఆర్‌ ఖన్నాను గుర్తు చేసుకుంటూ... ఆయన కూడా కోర్ట్‌ నంబర్‌ 2 నుంచే రిటైర్‌ అయ్యారని అంటూ... (కోర్ట్‌ నంబర్‌ 1 ప్రధాన న్యాయమూర్తిది) వీరిద్దరూ ప్రధాన న్యాయమూర్తులు కాలేకపోయారన్నారు.
'ఆయన(జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా) కోర్ట్ నం.2లో కూర్చునేవారు. ఆయన గురించి అందరూ ఎపుడూ మాట్లాడుకునేవారు. ఇదిగో ఇక్కడ ఆయన ఫొటో ఉంది. మీ ఫోటో కూడా ఇక్కడ ఉంటుందని కచ్చితంగా చెప్పగలన'ని శాంతి భూషణ్‌ అన్నారు. తన 40 ఏళ్ళ ప్రాక్టీస్‌లో కొంత మంది గొప్ప న్యాయమూర్తుల ఎదుట నేను వాదించాను. వారిలో జాస్తి కూడా ఒకరని ఆయన ప్రశంపించారు. సీనియర్‌ లాయర్‌ దుష్యంత్‌ దవే మాట్లాడుతూ జస్టిస్‌ చలమేశ్వర్‌ వంటి న్యాయమూర్తుల ఎదుట వాదించే అదృష్టం తనకు కల్గిందన్నారు. వీరి వీడ్కోలు సందేశం విన్న తరవాత జాస్తి చలమేశ్వర్‌ చలించిపోయారు. సుప్రీం కోర్టులో తాను ఆరేళ్ళ పది నెలలు పనిచేశానని తాను ఎపుడైనా కోప్పడి ఉంటే, తన ప్రవర్తన సహేతుకంగా లేకుంటే... అది తాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా వ్యతిరేకత లేదన్నారు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా  సిద్ధమై రాకపోవడం లేదా ఇతర ఇతర ఇటువంటి కారణాలై ఉంటాయన్నారు.  ఎవరివైనా మనోభావాలను గాయపరిచి ఉంటే క్షమాపణలు చెబుతున్నానంటూ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు.