లాభాల‌తో ఆరంభం: బ‌డ్జెట్ కీల‌కం

లాభాల‌తో ఆరంభం: బ‌డ్జెట్ కీల‌కం

మార్కెట్ చాలా అప్రమ‌త్తంగా ఉంది. స్వల్ప లాభాల‌తో ప్రారంభమైంది. నిన్న భారీ లాభాలు గ‌డించినా.. ఇవాళ ఫిబ్రవ‌రి డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రారంభం కావ‌డంతో... ఇన్వెస్ట‌ర్లు బ‌డ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్నటి రోల్ ఓవ‌ర్స్ సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని... ఈ నెల‌లో భారీ ప‌త‌నం ఉండ‌క‌పోవ‌చ్చని అన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు. నిన్న యూరో, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా  ముగిశాయి. డౌజోన్స్ రెడ్‌లో క్లోజ్ కాగా నాస్‌డాక్ ఒక‌టిన్నర శాతం, ఎస్ అండ్ పీ 500 దాదాపు ఒక శాతం లాభంతో క్లోజ‌య్యాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లో కూడా మిశ్రమ ధోర‌ణి క‌నిపిస్తోంది. న్యూజిల్యాండ్‌, హాంగ్‌సెంగ్‌లు న‌ష్టాల్లో ఉండ‌గా, ఇత‌ర మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అయితే లాభ‌న‌ష్టాలు నామ‌మాత్రంగా ఉన్నాయి.  క్రితం ముగింపుతో పోలిస్తే పాతిక పాయింట్ల లాభంతో 10,850-60 మ‌ధ్య నిఫ్టి క‌ద‌లాడుతోంది. నిఫ్టిలో మెజారిటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో హీరో మోటోకార్ప్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లాభాల్లో ముందున్నాయి. ఇక ఇవాళ‌ అత్యధిక న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్న నిఫ్టి షేర్ల‌లో వేదాంత‌, జెఎస్‌డ‌బ్ల్యూఎస్ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, స‌న్ ఫార్మా, టీసీఎస్ ఉన్నాయి.  ఫ‌లితాలు నిరుత్సాహ‌క‌రంగా ఉండ‌టంతో వేదాంత 17 శాతంపైగా న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. ఇక దీవాన్ హౌసింగ్‌లో ప‌త‌నం కొన‌సాగుతోంది. ఇవాళ మ‌రో 8 శాతం క్షీణించి రూ 125 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. చాలా రోజుల త‌ర‌వాత గ్రాఫైట్ 9 శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.