రూపాయి దెబ్బకు షేర్లు మటాష్

రూపాయి దెబ్బకు షేర్లు మటాష్

ప్రభుత్వం, ఆర్బీఐ రూపాయిని గాలికి వొదిలేయడంతో పతనం కొత్త రికార్డు సృష్టించింది మన కరెన్సీ. ఒకదశలో 72.72 కి పడిపోయింది (కరెన్సీ మార్కెట్ ఇంకా నడుస్తోంది) దీంతో షేర్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఉదయం చాలా స్థిరంగా ప్రారంభమైన మార్కెట్లు రూపాయి పతనం మేరకు పడుతూ వచ్చాయి. మిడ్ సెషన్ తరవాత రూపాయి పతనం స్పీడందుకుంది. దీంతో షేర్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అన్ని రంగాల షేర్లను ఇన్వెస్టర్లు వొదిలించుకున్నారు. అయినకాటికి అమ్మడం మొదలయ్యేసరికి బ్లూచిప్ షేర్లు భారీగా నష్టపోయాయి.  ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. హాంగ్ సెంగ్ మినహా దాదాపు ఇతర మార్కెట్లన్నీ ఒక శాతం వరకు లాభపడ్డాయి. తరవాత మొదలైన యూరో మార్కెట్లు కూడా స్థిరంగా ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నా ఫలితం లేకపోయింది. స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేయడమే రూపాయి పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. డాలర్‌ ధరలో మార్పు లేదు అలాగే క్రూడ్ లో కూడా... అయినా రూపాయి పతనం కావడం వెనుక విదేశీ  ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలే కారణమని స్టాక్ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. షేర్లతో పాటు బాండ్లను కూడా విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్ముతున్నారు. ఆరు షేర్లు మినహా మిగిలిన అన్ని నిఫ్టి షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌ టీపీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ షేర్లు లాభాలతో ముగిశాయి.  ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో టైటాన్ 4.5 శాతం నష్టంతో ముగిసింది. టాటా స్టీల్ కూడా నాలుగు శాతం పడింది. ఐటీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ షేర్లు కూడా మూడు శాతంపైగా నష్టపోయాయి. ఇతర షేర్లలో పవర్ ఫైనాన్స్‌ షేర్ 9 శాతం క్షీణించింది.  ఆర్ కామ్, జేపీ అసోసియేట్స్ అయిదు శాతంపైగా నష్టపోయాయి.