సూచీలు సూపర్‌... షేర్లు ఢమాల్‌

సూచీలు సూపర్‌... షేర్లు ఢమాల్‌

నిఫ్టి మళ్ళీ 11000 స్థాయిని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 105 పాయింట్లు లాభపడిన నిఫ్టి ప్రస్తుతం 11038 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 7 శాతంపైగా లాభపడటంతో మీడియా షేర్లసూచీ 4 శాతం దాకా పెరిగింది. అలాగే మెటల్‌, ఐటీ షేర్ల సూచీలు ఒకటిన్నర శాతంపైగా పెరిగాయి. ఒక్క ఫార్మా మినహా మిగిలిన షేర్ల సూచీలన్నీ గ్రీన్లో ఉన్నాయి.  ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన టెక్‌ మహీంద్రా షేర్‌ 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకి రూ. 794 వద్ద ట్రేడవుతోంది. 

మిడ్‌ క్యాప్‌ ఢమాల్‌
బ్లూచిప్‌ షేర్లలో ర్యాలీ కన్పిస్తున్నా..అనేక చిన్న, మధ్య తరహా షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. పలు కీలక షేర్లు కూడా గరిష్ఠ స్థాయిని నుంచి 40 శాతం దాకా క్షీణించాయి. మిడ్‌ క్యాప్‌ 50, స్మాల్‌ క్యాప్‌ 50 సూచీలు అరశాతంపైగా నష్టంతో ఇవాళ ట్రేడవుతున్నాయి. ప్రధానంగా అనిల్‌ అంబానీ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీలు భారీగా క్షీణించాయి. ఆర్‌ పవర్‌ కాస్త కోలుకున్నట్లు కన్పిస్తున్నా... ఆర్‌ కామ్‌ ఇవాళ మళ్ళీ 5 శాతంపైగా నష్టంతో రూ. 5.25 వద్ద ట్రేడవుతోంది. ఇక రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇవాళ కూడా ఏకంగా 28 శాతం క్షీణించడం విశేషం. రిలయన్స్‌ క్యాపిటల్‌ కూడా రూ. 135.90కి పడిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ షేర్‌ రూ. 521 పలికింది. సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నా... అనేక చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇక పెద్ద షేరలు కూడా పతనం ప్రారంభిస్తే.. చిన్న షేర్లకు దిక్కు ఉండదని మార్కెట్‌ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. అందుకే బ్లూచిప్‌ కంపెనీలకే పరిమితం కావాల్సిందిగా ఇన్వెస్టర్లకు సలహా ఇస్తున్నారు.