వారి స్థానాల్లో శుభమాన్, శంకర్‌

వారి స్థానాల్లో శుభమాన్, శంకర్‌

అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాడు శుభమాన్ గిల్ (19) మొదటిసారి భారత జట్టులో చోటు సంపాదించాడు. గిల్ తో పాటు విజయ్‌ శంకర్‌ కూడా జట్టులోకి వచ్చాడు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ క‌ర‌ణ్‌' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య స్థానాలను శుభమాన్ గిల్, విజయ్‌ శంకర్‌లతో భర్తీ చేశారు. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు వన్డేలకు విజయ్‌ శంకర్‌ జట్టులోకి రానుండగా, శుభమాన్ గిల్ న్యూజిలాండ్ సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ మేరకు ఐసీసీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

ఆస్ట్రేలియాతో రెండో వన్డే మంగళవారం అడిలైడ్‌లో జరగనుంది. అప్పటిలోగా వీరిద్దరూ వన్డే జట్టుతో కలిసే అవకాశం ఉంది. భారత్‌-ఎ తరపున విజయ్‌ శంకర్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో రాణించాడు. కాగా విజయ్‌ ఇప్పటికే టీ-20ల్లో భారత్‌ తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న శుభమాన్ గిల్ మాత్రం భారత జట్టులోకి ఎంపికవడం ఇదే తొలిసారి.