ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుణాత్మక పాత్ర పోషించాలి...

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుణాత్మక పాత్ర పోషించాలి...

ఈ దేశ స్వరూప స్వభావాలు మార్చడంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుణాత్మక పాత్ర పోషించాలన్నారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి... హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ సంస్థలో గ్రామీణాభివృద్ధిలో నూతన వ్యూహాలు, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరుగుతోన్న ట్రైనింగ్, వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ... దేశ అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. 71 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో ఇంకా సమాజంలో అనేక రకాల వివక్షత, సమస్యలు నెలకొని ఉన్నాయని... ఏక కాలంలో అనేక వైరుద్యాలున్నాయని... మన దేశంలో కుబేరులు, సంపన్నులతో పాటు నిరుపేదలు, అభాగ్యులు కూడా ఉన్నారని తెలిపారాయన. 

నేటికీ ఇలాంటి తారతమ్యాలు కొనసాగడం సరికాదన్నారు మధుసూదనాచారి... అంతరాలు తొలిగి పోవాలి... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రతీ ఒక్కరూ ఈ వివక్షను తొలగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారాయన. అందులో భాగంగా నా నియోజకవర్గంలో పల్లె నిద్ర, పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వెల్లడించిన స్పీకర్... మారు మూల ప్రాంతానికి చెందిన, భాహ్య ప్రపంచానికి తెలియని పది కుటుంబాలు నా నియోజకవర్గంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటికీ అధికారులెవరో... ప్రభుత్వం అంటే ఏమిటో? కూడా తెలియని ఇటువంటి కుటుంబాలు ఎట్లా అభివృద్ధిని సాధిస్తాయని ప్రశ్నించిన అసెంబ్లీ స్పీకర్... స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 15శాతం అక్షరాస్యత ఉండేది... ఏడాదికి ఒక్క శాతం పెరిగినా ఈ 70 ఏళ్లలో 90శాతం దాటి ఉండేదన్నారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని సీఎం కేసీఆర్ నిరూపించారంటూ ప్రశంసించారు స్పీకర్ మధుసూదనాచారి... సంక్షేమాభివృద్ధి పథకాల అమలు విషయంలో కేసీఆర్... దేశానికే మార్గదర్శకంగా నిలిచారన్న ఆయన... ఒక నాయకుడికి విజన్ వుంటే అద్భుతాలు సృష్టించడం సాధ్యమే అని కేసీఆర్ చాటి చెప్పారని వెల్లడించారు.