గజినీ తరహా పాత్రలో శ్రీ విష్ణు

గజినీ తరహా పాత్రలో శ్రీ విష్ణు
తెలుగు యువహీరో శ్రీవిష్ణు తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులకు బాగా చేరువవుతున్నాడు. తాజాగా నీది నాది ఒకే కథ సినిమాతో సినీ విమర్శకులను, ప్రేక్షకులను మెప్పించాడు. కెరియర్ ఆరంభం నుండి అప్పట్లో ఒకడుండే వాడు ద్వారా మాస్ రోల్లో మెప్పించి, మెంటల్ మదిలో సినిమాతో రొమాంటిక్ రోల్లోను నటించి మురిపించాడు. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీ విష్ణు చేయబోయే సినిమాలో సరికొత్త లుక్ లో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. పాత్ర స్వభావాన్ని బట్టి గజినీ సినిమాలో సూర్య చేసిన పాత్రకు దగ్గరగా గుండుతో..ఒళ్ళంతా టాటూలతో ఉంటుందట. ఈ ప్రాజెక్టు చిన్నపాటి మల్టీ స్టారర్ తరహాలో నారా రోహిత్, సుధీర్ బాబు కీలక పాత్రలతో తెరకెక్కుతోంది. సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు వీర భోగ వసంత రాయలు అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తుండగా, బాబా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.