కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి నుంచి మన మార్కెట్లు తప్పించుకోలేకపోయాయి. చైనాకు చెందిన హువాయి కంపెనీ యజమాని కుమార్తె (కంపెనీ సీఎఫ్‌ఓ)ను కెనెడా అధికారులు ఈ నెల 1న అరెస్ట్‌ చేశారు. అమెరికా విజ్ఞప్తి మేరకు తాము అరెస్ట్‌ చేసినట్లు కెనెడా పేర్కొంది. ఆంక్షలు విధించిన తరవాత కూడా ఇరాన్‌కు తమ ఉత్పత్తులను హువాయి (హానర్‌ మొబైల్‌ ఫోన్ల తయారీదారు) ఎగుమతి చేసిందని అమెరికా అంటోంది. అమెరికా చర్యతో చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని టెక్నాలజీ కంపెనీ భయపడుతున్నారు. దీంతో రాత్రి అమెరి నాస్‌డాక్‌ సూచీ నాలుగు శాతం వరకు క్షీణించింది. ఇతర సూచీలు ఇదే స్థాయిలో పడ్డాయి. ట్రంప్‌ వైఖరితో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ అంటే దాదాపు మూడు శాతం నష్టంతో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ నుంచి ప్రారంభమైన యూరో మార్కెట్లలోనూ భారీ పతనం తప్పలేదు. అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా ఒకటి నుంచి రెండు శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి. దీంతో మిడ్‌ సెషన్‌ వరకు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడైన నిఫ్టి... తరవాత బాగా బలహీనపడింది. 70 పాయింట్ల నష్టం నుంచి 181 పాయింట్ల నష్టానికి పతనమైంది. నిఫ్టి అత్యంత కీలక స్థాయి అయిన 10601 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ కూడా 572 పాయింట్లు క్షీణించింది. డాలర్‌ ఇప్పటికే క్షీణించగా, ట్రంప్‌ తాజా నిర్ణయంతో క్రూడ్‌ ధరలు కూడా బాగా క్షీణించాయి. ప్రస్తుతం క్రూడ్‌ ధరలు రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. భారీగా స్టాక్‌ మార్కెట్లు పతనం కావడంతో ఆర్థిక వృద్ధిరేటు మందగిస్తుందని, క్రూడ్‌కు డిమాండ్‌ తగ్గుతుందని వార్తలు రావడమే దీనికి కారణం. ఇక మన మార్కెట్‌లో అన్ని రంగాల షేర్లపై ఒత్తిడి వచ్చింది. నిఫ్టిలోని 50 షేర్లలో 46 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో,రియల్‌ ఎస్టేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి ప్రధాన షేర్లలో సన్‌ ఫార్మా ఒక శాతం పెరగ్గా, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు నామమాత్ర లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌  టాప్‌లో ఉంది. ఈ షేర్‌ ఆరు శాతం క్షీణించగా.... మారుతీ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ షేర్లు నాలుగు శాతంపైగా నష్టంతో ముగిశాయి.