స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్‌

అంత‌ర్జాతీయ మార్కెట్లు స్త‌బ్దుగా ఉన్నాయి. డాల‌ర్‌, ముడి చ‌మురు ధ‌ర‌లు కూడా నిల‌క‌డగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. జ‌పాన్ నిక్కీతో పాటు హాంగ్‌సెంగ్ ఒక మోస్త‌రు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కూడా స్థిరంగా ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం నిఫ్టి 15 పాయింట్ల లాభంతో 10835 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఐటీ షేర్లు మార్కెట్‌ను బాగా దెబ్బ‌తీశాయి. టీసీఎస్ ప‌లితాలు అద్భుతంగా ఉన్నాయని వార్త‌లు వ‌స్తున్నా... విశ్లేష‌కులు మాత్రం కంపెనీ గైడెన్స్‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఒక‌ద‌శ‌లో రూ. 50 న‌ష్ట‌పోయిన టీసీఎస్ షేర్ ఇపుడు స్వ‌ల్పంగా కోలుకుని రూ.37 న‌ష్టంతో రూ. 1852 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఇవాళ ప‌లితాలు ప్ర‌క‌టించ‌నున్న ఇన్ఫోసిస్ షేర్ కూడా  తీవ్ర హెచ్చుత‌గ్గుకుల‌కు లోనౌతోంది. డివిడెండ్‌తో పాటు షేర్ల బై బ్యాక్ కూడా ప్ర‌తిపాద‌న‌లు కూడా ఉండ‌టంతో ఈ షేర్ ప్ర‌స్తుతం  స్వ‌ల్ప లాభంతో రూ. 682 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర‌ల్లో ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, హిందాల్కో, ఐఓసీ షేర్లు ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో   టీసీఎస్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్ టెక్‌, మ‌హీంద్రా అండ్  మ‌హీంద్రా, ఇన్‌ఫ్రాటెల్ ఉన్నాయి.   నిన్న ప‌ది శాతం పెరిగిన జీటీఎల్ ఇన్‌ఫ్రా, ఇవాళ మ‌రో 5 శాతం పెరిగింది.