నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

నిఫ్టి లాభాలకు బ్రేక్ పడింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలను తాకిన సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో పాటు టర్కీ కరెన్సీ సంక్షోభ వార్తలతో స్టాక్‌ మార్కెట్ లో అమ్మకాల హోరు పెరిగింది.  లిరా భారీ క్షీణించడంతో  యూరో మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. 2001 తరవాత తొలిసారిగా టర్కీ కరెన్సీ లిరా డాలర్ తో ఏకంగా 12 శాతం క్షీణించింది. ప్రపంచ మార్కెట్ల ఒత్తిడి, వారాంతం కావడంతో అధికస్థాయిల వద్ద లాభాల స్వీకరణ వచ్చింది. దీంతో నిఫ్టి 41 పాయింట్లు నష్టపోయి 11429 వద్ద ముగిసింది. ఎస్బీఐ ఫలితాలు దారుణంగా ఉండటంతో పీఎస్ యూ బ్యాంకుల సూచీ ఏకంగా నాలుగు శాతం వరకు నష్టపోయింది. అలాగే మెటల్‌ సూచీ రెండు శాతం క్షీణించింది.ఫార్మా రంగంలోనూ అమ్మకాలు పెరిగాయి. ఒక్క ఐటీ మినహా దాదాపు మిగిలిన అన్నీ రంగాల సేర్లు క్షీణించాయి. నిప్టి ప్రధాన షేర్లలో ఐషర్ మోటార్స్ రికార్డుస్థాయిలో 5శాతం పైగా పెరిగింది. అలాగే బీపీసీఎల్ మూడు శాతం లాభపడింది.హెచ్ పీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్ పీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఎస్బీఐ ముందుంది. ఇవాళ ఎస్బీఐ షేర్ ఒకదశలో రూ. 326ని తాకి.. చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా రూ. 303 వద్ద ముగిసింది. వేదాంత, టాటా మోటార్స్, గెయిల్, సన్‌ ఫార్మా షేర్లు కూడా మూడు శాతంపైగా నష్టంతో ముగిశాయి.