దేశంలో అత్యధిక స్థాయికి చేరిన నిరుద్యోగ రేటు

దేశంలో అత్యధిక స్థాయికి చేరిన నిరుద్యోగ రేటు

రెండేళ్ల క్రితం ఇవాళే పెద్దనోట్లు రద్దయ్యాయి. ఈ నిర్ణయం తర్వాత దేశంలో నిరుద్యోగ రేటు పెరిగినట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. సీఎంఐఈ జరిపిన ఒక పరిశీలనలో ఈ ఏడాది అక్టోబర్ లో నిరుద్యోగిత పెరిగి 6.9%కి చేరినట్టు స్పష్టమైంది. ఇది రెండేళ్లలో అత్యధిక స్థాయి కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఉద్యోగం చేయాలనుకొనే యువత శాతం కూడా 42.4% వరకు పడిపోయింది. 2016 తర్వాత ఇదే అత్యధిక కనిష్ట స్థాయి. పని చేయాలనుకొనే యువత సంఖ్యలో తగ్గుదల పెద్దనోట్ల రద్దు తర్వాతే పెరిగినట్టు సీఎంఐఈ చెప్పింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని పేర్కొంది. సెప్టెంబర్ వరకు పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ ఉద్యోగ మార్కెట్ లో అక్టోబర్ నెలకు ఉద్యోగ రేటు భారీగా పడిపోయింది.

ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య అక్టోబర్ 2018లో 39.7 కోట్లు ఉన్నట్టు తేలింది. అక్టోబర్ 2017లో ఈ సంఖ్య 40.7 కోట్లుగా ఉంది. అంటే ఉద్యోగుల సంఖ్యలో దాదాపుగా 2.4% తరుగుదల కనిపించింది. నిరుద్యోగ రేటు ఇంత వేగంగా పెరగడం మార్కెట్ కి ఆందోళన కలిగించేదేనని సీఎంఐఈ తన బులిటిన్ లో తెలిపింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగుల సంఖ్య 2.95 కోట్లకు చేరింది. ఇవి అక్టోబర్ 2018 నాటి ఫలితాలు. ఇవి కొన్నేళ్లతో పోలిస్తే రెండు రెట్ల కంటే ఎక్కువ. అక్టోబర్ 2017లో ఉద్యోగార్థుల సంఖ్య 1.4 కోట్లుగా ఉంది.

దేశంలో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగార్థులు మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నారు. వీరి సంఖ్యతో పోలిస్తే ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి.