'సీబీఐ' నాగేశ్వరరావు దోషే... మూల కూర్చోబెట్టిన సుప్రీం

'సీబీఐ' నాగేశ్వరరావు దోషే... మూల కూర్చోబెట్టిన సుప్రీం

సుప్రీం కోర్టు చరిత్రలో చాలా అరుదైన ఘటన ఇవాళ చోటు చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా సీబీఐ మాజీ తాత్కాలిక బాస్‌ నాగేశ్వరరావును ఓ మూల కూర్చోవాల్సిందిగా సుప్రీం కోర్టు శిక్ష వేసింది. బెంచ్‌ లేచే వరకు అంటే విశ్రాంతి కోసం లేచే వరకు కోర్టు గదిలో ఓ మూల కూర్చోవలసిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగోయ్‌ ఆదేశించారు. బీహార్‌ వసతి గృహాల్లో అరాచకాలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని తమ అనుమతి లేకుండా మార్చవద్దని గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుకు విరుద్ధంగా విచారణ అధికారిని సీబీఐ తాత్కాలిక బాస్‌గా ఉన్న ఎం నాగేశ్వరరావు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘించారంటూ నోటీసు జారీ చేసింది. దీనికి సారీ చెబుతూ నాగేశ్వరావు సోమవారం అఫడివిట్‌ దాఖలు చేశారు. ఇవాళ ఆయన స్వయంగా హాజరయ్యారు. ఆయన తరఫున అటార్నీ జనరల్‌ వాదనలు ప్రారంభించేసరికి ప్రధాని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అధికారి తప్పు చేస్తే ప్రభుత్వం ధనంతో ఆయన తరఫున ఎలా వాదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన 20 ఏళ్ళలో తాను ఎపుడూ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘించారని ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని అన్నారు.   ఉద్దేశపూర్వకంగా చేయలేదని, పొరపాటు జరిగిందని క్షమాపణ పత్రంలో చెప్పిన రావు
సారీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జస్టిస్‌ గొగోయ్‌ వ్యాఖ్యానించారు. సారీ చెబితే సరిపోతుందా? మా ఉత్తర్వులు తీసుకుని బదిలీ చేస్తే ఏమౌతుందని.. ఆకాశం విరిగి మీద పడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేశ్వరరావుకు లక్ష రూపాయల జరిమానా విధంచడం పాటు కోర్టు విశ్రాంతి కోసం లేచే వరకు గదిలో ఓ మూల నిలబడి ఉండాల్సిందిగా నాగేశ్వరరావును ఆదేశించింది. ఆయన చెప్పిన 'సారీ'ని తిరస్కరించిన కోర్టు.. శిక్ష విధించింది.