దేశవ్యాప్తంగా 312 స్వైన్ ఫ్లూ మరణాలు, 9,000కి పైగా బాధితులు

దేశవ్యాప్తంగా 312 స్వైన్ ఫ్లూ మరణాలు, 9,000కి పైగా బాధితులు

దేశంలో స్వైన్ ఫ్లూ సైరన్ మోగుతోంది. స్వైన్ ఫ్లూతో దేశవ్యాప్తంగా 312 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. గత వారం 86 మంది మరణించినట్టు తెలిపింది. 9,000 మందికి పైగా హెచ్1ఎన్1 వైరస్ ప్రభావితులయ్యారని చెప్పింది. కేంద్రం ఇచ్చిన డేటా ప్రకారం స్వైన్ ఫ్లూ కేసులు, మరణాలు రాజస్థాన్ లోనే అధికంగా ఉన్నాయి. 

ఆదివారం వరకు దేశవ్యాప్తంగా 9,367 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ కారణంగా 107 మరణాలు సంభవించాయి. మరో 2,941 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్ లో స్వైన్ ఫ్లూ కారణంగా 55 మంది మరణించగా 1,431 మంది వ్యాధిగ్రస్తులయ్యారు. పంజాబ్ లో స్వైన్ ఫ్లూ కారణంగా 30 మంది ప్రాణాలు విడిచారు. 335 మందికి వ్యాధి సోకింది. మధ్యప్రదేశ్ లో 22 మరణాలు, 98 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర లో స్వైన్ ఫ్లూ మహమ్మారి 17 ప్రాణాలు బలిగొంది. మరో 204 మంది స్వైన్ ఫ్లూ పీడితులు ఉన్నారు. హెచ్1ఎన్1 వైరస్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో 7 మరణాలు నమోదయ్యాయి. 1,669 స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. హర్యానాలో 7 స్వైన్ ఫ్లూ మరణాలు జరిగాయి. 640 కేసులు గుర్తించారు. తెలంగాణలో 5 మరణాలు, 424 ఇన్ఫెక్షన్ కేసులు గుర్తించడం జరిగింది. 

రోజురోజుకీ స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించే చర్యలు చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వెంటిలేటర్ సౌకర్యం అవసరమయ్యే వ్యాధి ముదిరిన కేసుల చికిత్స కోసం ఆస్పత్రుల్లో పడకలు ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించింది. ప్రజల్లో స్వైన్ ఫ్లూ వ్యాధిపై అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కోరింది.