టీసీఎస్‌ అదరహో..!

టీసీఎస్‌ అదరహో..!

దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారు టీసీఎస్‌ 2018 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో దుమ్మురేపింది. సంస్థ నికర లాభంలో 24.1 శాతం వృద్ధి సాధించింది. రూ.8,105 కోట్ల లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి సంస్థ రూ.6,531 కోట్ల నికర లాభం నమోదు చేయడం గమనార్హం.

టాటా గ్రూప్‌ సంస్థల్లోనే ఎక్కువ లాభాల్నినమోదు చేసే టీసీఎస్‌ ఈ త్రైమాసికానికి ఆదాయంలో 20.8 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. గతేడాదిలోని రూ.30,904 కోట్ల నుంచి ఆదాయం రూ.37,338 కోట్లకు పెరిగింది. కరెన్సీ ఆధారంగా ఆదాయ వృద్ధి 12.1 శాతంగా ఉంది. గత 14 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటని సంస్థ సీఈవో, ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ వెల్లడించారు. మంచి క్లయింట్లు, డిజిటల్‌ సేవల్లో అగ్రస్థానంలో ఉండటం, ఎక్కువ ఆర్డర్లు ఉండటంతో వినియోగదారులు టీసీఎస్‌ సామర్థ్యాలను గుర్తించారని ఆయన తెలిపారు. డిజిటల్‌ సేవల ద్వారా వచ్చే రాబడి ఆదాయంలో 30.1 శాతంగా ఉండగా వార్షిక వృద్ధి రేటు 52.7 శాతంగా నమోదైంది.

ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి పదేపదే ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా, ఇతర మార్కెట్లలో వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా టీసీఎస్‌ పటిష్ఠంగా నిలబడిందని ఆ సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి వి.రామకృష్ణన్‌ తెలిపారు. ఇక 2018 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ 6,827 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఉద్యోగుల సంఖ్య 4,17,929కి చేరింది. పన్నెండు నెలల ఆధారంగా సంస్థను వదిలేస్తున్న వారి శాతం 11.2గా ఉంది.