హరీష్ రావు లేకుంటే కేసీఆర్ లేరు

హరీష్ రావు లేకుంటే కేసీఆర్ లేరు

హరీష్ రావు లేకుంటే కేసీఆర్ లేరు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు రేవూరి ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేసీఆర్ కు తనపై ఉన్న అపోహాలను తొలగించుకోవడానికే లేఖ పేరుతో హరీష్ రావు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మెప్పుకోసమే హరీష్ చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు. హరీషును సిద్దిపేట, గజ్వేలుకే పరిమితం చేశారు. తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని గతంలో హరీష్ అలిగితే తర్వాత సర్దుబాట్లు చేసుకున్నారని పేర్కొన్నారు. వేరే పార్టీలో ఉన్నా హరీషును వ్యక్తిగా గౌరవిస్తా, రాజకీయంగా విబేధిస్తా అని ఆయన అన్నారు. 

అనేక సందర్భాల్లో కేటీఆర్ చంద్రబాబును పొగిడిన విషయాన్ని హరీష్ రావు గుర్తుంచుకోవాలి అని రేవూరి ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందంటే కారణం చంద్రబాబే అని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో దిగువ రాష్ట్రాలకు కొన్ని ఆందోళనలు ఉండడం సహజమే. రెండు రాష్ట్రాల మధ్య జరిగే రెగ్యులర్ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ తప్పుడు విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బాగు కోరే చంద్రబాబును విమర్శించే విషయంలో హారీష్, కేటీఆర్ పోటీలు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీలు ఈ దేశంలోనే ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులుంటే ట్రిబ్యునల్స్, సీడబ్ల్యూసీ వంటి వేదికల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.