ఖరారైన 'మహానాడు' వేదిక

ఖరారైన 'మహానాడు' వేదిక

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు పండగలా 'మహానాడు'ను జరుపుకుంటాయి... టీడీపీ మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం వేదికను ఖరారు చేశారు. కానూరు సిద్ధార్థ కళాశాల మైదానంలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తెలిపారు. కానూరు సిద్ధార్థ కాలేజ్‌ను పరిశీలించిన ఆయన... మహానాడు వేదిక నుంచి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం ఉంటుందన్నారు. అన్నింటికీ అనువైన ప్రాంతంగా ఉంటుందనే సిద్ధార్థ కాలేజ్‌ను ఎన్నుకున్నామని... మహానాడు నిర్వహణకు 14 కమిటీలు వేసినట్టు వెల్లడించారు కళా వెంకట్రావ్. మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం, ఢిల్లీ పరిణామాలు, దేశంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చిస్తామని తెలిపారాయన. ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న రాజకీయ కుట్రలను కూడా మహానాడు వేదికగా చర్చిస్తామన్నారు వెంకట్రావ్.