తెదేపా మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ

తెదేపా మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ

తెలుగుదేశం పార్టీ 'మహానాడు' నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికలకు ముందు జరుగుతున్న వేడుక కావటంతో ఈ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా పోయేందుకు పార్టీ శ్రేణులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. విజయవాడ ప్రాంతంలో ఎన్టీఆర్ హయాంలో మూడు మహానాడులు జరిగితే...  చంద్రబాబు హయాంలో జరుగుతున్న తొలి మహానాడు ఇది. 
ఈ వేడుక కోసం కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పార్టీ ముఖ్య నేతలు ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మహానాడు ఏర్పాట్లకు భూమిపూజ జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ విభాగాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదినాన మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదనీ..  మొత్తం 2లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన స్టేజీ 60అడుగుల పొడువు 120అడుగుల వెడల్పుతో మొత్తం 250మంది అశీనులయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వేదిక ద్వారా కేంద్రం ఏపీని ఎలా మోసం చేసిందో వివరిస్తామని వెల్లడించారు. అలాగే ఈసారి మహానాడు వేదికగా 14 తీర్మానాలు చేయనున్నామని.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చేవరకు చంద్రబాబు నాయుడు పోరాటం చేయనున్నారని వివరించారు. ఇదే వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు అటు పార్టీకి.. ఇటు ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నట్లు కళా వెంకట్రావు తెలిపారు. ఈ నెల 27,28, 29 తేదీలలో మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది.