పొత్తులపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు

పొత్తులపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల పొత్తులపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమిత్ షా పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. బీజేపీ బహిరంగ సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలిపారు. 12 గంటలకు బీజేపీ కార్యాలయంలో అమిత్ షా మీడియా సమావేశం.. 2 గంటలకు లాలదర్వాజ అమ్మవారి ఆశీస్సులు పొంది పాలమూరు బహిరంగ సభకు బయలుదేరుతారని పేర్కొన్నారు. 6.30 కి కొత్తూరులో రాష్ట్ర అధికారులు, జిల్లా ఇంచార్జి, జిల్లా అధ్యక్షులతో సమావేశం అయి ఎన్నికల తయారీపై చర్చిస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో వారసత్వ రాజకీయాలు లేకుండా, అవినీతికి దూరంగా పాలన సాగుతోందని లక్ష్మణ్ అన్నారు.

ఎన్నికల తర్వాత ఏమి జరగబోతోందో.. మజ్లీస్ ఏమి చేయబోతోందో చెప్పేందుకే పాతపట్నం మహంకాళి ఆలయం నుండి అమిత్ షా ప్రచారం ప్రారంభించనున్నారని లక్ష్మణ్ తెలిపారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోవద్దు, తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. అన్ని పార్టీలు గతంలో మజ్లీస్ కి వత్తాసు పలికి.. గల్లీ పార్టీని ఢిల్లీకి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. తాడు అనుకున్న మజ్లీస్ ఉరితాడు కాబోతోంది.. పాముకి పాలు పోసి పెంచారని ఆయన విమర్శించారు. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ కి ఊపిరి పోసేందుకు టీడీపీ, సీపీఐ పోటీ పడుతున్నాయి.. అవినీతి కాంగ్రెస్ ని అవి బతికించలేవున్నారు. మజ్లీస్, టీఆర్ఎస్ ల పొత్తును తేలికగా తీసుకోవద్దన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ విమోచన వీరులకు గుర్తింపు వస్తోందన్నారు.

మహబూబ్ నగర్ సభ తర్వాత 15 రోజుల్లో కరీంనగర్ లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందిని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 25 వరకు ఓటర్ల నమోదులో క్రియాశీలకంగా కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. పారదర్శకమయిన ఓటర్ల జాబితాతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలన్నారు. అసెంబ్లీల వారిగా మొదటి విడతలో 50 సభలలో పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారని ఆయన తెలిపారు.