స్మగ్లింగ్‌కు పాల్పడితే పీడీ యాక్టు...

స్మగ్లింగ్‌కు పాల్పడితే పీడీ యాక్టు...

కలప స్మగ్లింగ్‌కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. స్మగ్లింగ్‌కు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ  పరిరక్షణ, అడవుల పెంపకంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్మగ్లింగ్‌కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల సహకారంతో కలప స్మగ్లరపై ఉక్కుపాదం మోపాలని, తరచూ స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. కలప స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను నాలుగు విభాగాలుగా విభజించుకుని చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కల పెంపకం, అడవి పునరుద్ధరణ, హైదరాబాద్ నగరం లోపలా బయటా పచ్చదనం పెంచడం, కలప స్మగ్లింగ్ అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలని సీఎం సూచించారు. అడవుల్లో సహజంగా చెట్లు పెరుగుతాయి. అడవుల ద్వారా లభించే పచ్చదనమే ఎక్కువ. ఓ వైపు అడవులు నశించిపోతుంటే, హరితహారం లాంటి కార్యక్రమాల ద్వారా ఎన్ని చెట్లు పెంచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అడవులను కాపాడితే పచ్చదనం కాపాడినట్లే. అడవులను కాపాడడమంటే, భూమిధర్మాన్ని కాపాడినట్లే అని తెలిపారు. గతంలో నక్సలైట్ల కారణంగా అడవుల్లోకి వెళ్లడం సాధ్యం కావట్లేదు అని సాకులు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి సమస్య కూడా లేదు. అడవులను కాపాడడమే లక్ష్యంగా పనిచేయండి. పోలీస్, అటవీ అధికారులు సంయుక్త  సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.