రిసోర్సు పర్సన్లకు సిఎం కేసీఆర్ దిశానిర్దేశం

 రిసోర్సు పర్సన్లకు సిఎం కేసీఆర్ దిశానిర్దేశం

గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళిలు అమలు కావాలని తెలంగాణ  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్సు పర్సన్స్ తో సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు వార్డు సభ్యులను, గ్రామాల ప్రజలను కలుపుకుని సామూహికంగా గ్రామ వికాసానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని కోరారు. 

మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున,  గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి పెట్టాలని సిఎం కేసీఆర్ కోరారు. 

గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు బదిలీ చేసే విషయంలో అత్యంత ఉదారంగా ఉంటామని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచులు, గ్రామ కార్యదర్శులను సస్సెండ్ చేసే విధంగా కఠిన చట్టాన్ని రూపొందించినట్లు సిఎం స్పష్టం చేసారు. గ్రామాల సర్పంచులను, గ్రామ కార్యదర్శులను ఛేంజ్ ఏజెంట్సుగా మార్చే బాధ్యతను రిసోర్సు పర్సన్లు చేపట్టాలని సిఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసారు.