తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. 

తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. 

తెలంగాణలో డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిజిపి సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అగ్రిగోల్డ్ కు చెందిన 2లక్షల 65వేల బాధితులకు న్యాయం జరగాలని.. అగ్రిగోల్డ్  ఆస్తులను తక్షణమే సీజ్ చేసి తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అగ్రిగోల్డ్ కు చెందిన 12 వందల ఎకరాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత సరికాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  

డిపాజిటర్లను మోసంచేసినఅగ్రిగోల్డ్ యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కేసులు పెట్టాలని..కర్ణాటక, ఏపి ప్రభుత్వాలు  ఇప్పటికే అగ్రిగోల్డ్ పై కఠినంగా వ్యవహరించినట్లే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాలని తెలిపారు. కార్పస్ ఫండ్ పెట్టి టీసర్కార్ డిపాజిటర్లను ఆదుకోవాలని.. డిపాజిటర్లను మోసంచేసిన అగ్రిగోల్డ్ చైర్మన్, డైరెక్టర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ డిపాజిటర్లను అగ్రిగోల్డ్ 500 కోట్లు మోసం చేసిందని.. తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ఏపీ సర్కార్ సీజ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని.. త్వరలో అగ్రిగోల్డ్  బాధితులతో పీసీసీ చీఫ్ సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు. తక్షణమే సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి డిపాజిటర్స్ ను ఆదుకోవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.