మన ప్రేక్షకులు మారుతున్నారు

మన ప్రేక్షకులు మారుతున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే వందమందిని చితకబాదే హీరో, అందమైన హీరోయిన్, విలన్ చుట్టూ పది కార్లు ఇలా ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే. కానీ ఇప్పుడు అలా కాదు పాత తరం పప్పులు ఏమాత్రం ఉడకడం లేదు. గతంలో తెరపై హీరో పాత్రను ప్రేక్షకుడికి చేరువ చేయాలంటే..రౌడీలను కొట్టించడం, హీరోయిన్ ని టీజ్ చేయడం, దాన గుణం వంటి ఎలిమెంట్స్ నే వాడుకునే వారు. అసలు రియల్ లైఫ్ కి తెర మీద జరిగే సన్నివేశాలకి ఏమాత్రం పొంతన లేని విధంగా సినిమా నడిచేది. పల్లెటూరిలో హీరో పెరగడం..ఆ తరువాత ఓ చిన్న డ్రామా.. వెంటనే ఫ్లాష్ బ్యాక్... భారీ ఫైట్ తో ఇంటర్వెల్ బ్లాక్. ఇక మిగిలిన సెకండ్ హాఫ్ అంతా జీర్ణించుకోలేని స్క్రీన్ ప్లే తో.. ఎత్తుకు పైఎత్తులు వేసే హీరో.. ఐటెం సాంగ్ చివరకి విలన్ ని అంతం చేయడం.. ఫ్యామిలీని, వాళ్ళ ఊరిని మొత్తం కాపాడడం. ఇదే మూస ధోరణిలో టాలీవుడ్ ఇన్నాళ్లు ప్రయాణించింది. 

కాలం మారేకొద్దీ సినిమా కూడా మారింది.. చూసే ప్రేక్షకులు మారారు.. ఆలోచన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ, సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి రావడమే. ఒకప్పుడు మన సినిమాలు మాత్రమే.. సినిమాలు అని అనుకున్న వారికి ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాకా అసలు సినిమా అంటే ఏంటో బాగా తెలుస్తోంది. ఈ రోజు ఓ చిన్న ట్రైలర్ రిలీజ్ అయితే చాలు కొన్ని గంటల వ్యవధిలోనే అది సినిమా నుంచి కాపీ కొట్టి తీశారో ఇట్టే పట్టేస్తున్నారు. అలాగే సినిమా అంటే ఓ మహా ప్రపంచం.. నటీనటులంతా దేవుళ్లుగా భావించి.. అమ్మో సినిమా అంటే ఇదా అని ముక్కున వేలేసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సినిమా ఏంటో.. సాధారణ ప్రేక్షకుడికి సైతం తెలుస్తోంది. సెలెబ్రిటీలు తమ హోదాను పక్కన పెట్టి ప్రజల మధ్యలోకి రావడం, సినిమా ప్రమోషన్స్ కోసం ప్రేక్షకులను కలవడం..పేస్ బుక్, ట్విట్టర్స్ లో ఫ్యాన్స్ తో చాటింగ్ సెషన్స్ తో అందుబాటులోకి వస్తున్నారు. 

ఇలాంటి పరిణామాలతో సినిమా అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఇక కెమెరాలు అందరికి అందుబాటులోకి రావడంతో పాతికేళ్ల కుర్రాళ్ళు షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ను తీసేస్తున్నారు. అంటే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. ఒకప్పడు సినిమా ఎలా తీస్తారు బాబు అని ఓ అమితాసక్తితో ఉన్న జనాలకి ఇలా ప్రతిదీ ఎప్పటికప్పుడు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్స్ వల్ల ఫిలిం మేకింగ్ ఇంకా చేరువైంది. కెమెరా ఉంటె చాలు సరదాగా తీసిన ఫోటోలు, వీడియోలతోనే ఓహో సినిమాటోగ్రాఫర్ చేసే పని ఇదా అని అర్థం చేసుకుంటున్నారు. ఇక కథల విషయానికొస్తే..కొత్తదనం మచ్చుకైనా లేదనుకోండి కనీసం ఆ సినిమా పోస్టర్ వైపు కూడా చూడట్లేదు మన తెలుగు ప్రేక్షకులు. 

ట్రైలర్ రిలీజ్ దగ్గరి నుండి ఇది హిట్టా ఫట్టా చెప్పే రేంజ్ కి ఎదిగిపోయారు. ఒకవేళ ఏ సినిమాకైనా కాపీ అని అనుమానం వస్తే ఆ డైరెక్టర్ సంగతి ఇక అంతే. వరల్డ్ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో..ఆ క్షణం నుంచే మన సినిమాలేంటి ఇలా ఉన్నాయి అని ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. రియాలిటీకి మన సినిమాలు ఏ మేర ఉంటున్నాయి..ఫలానా సీన్ కి అసలు ఫైట్ అవసరమా?, హీరో ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు ? స్క్రీన్ ప్లే ఎందుకు అలా రాసుకున్నాడు ? అని ప్రతి దానిపై మన ప్రేక్షకులకు పట్టు వస్తోంది. కొద్ది మంది ప్రేక్షకులను గ్రాంటెడ్ గా తీసుకుని ఎలా తీసిన కనీసం బి,సి సెంటర్స్ లోనైనా ఆడుతుంది అనే నమ్మకంతో ఉండే వాళ్ళకి చుక్కెదురవుతోంది. 

దీనికి ఉదాహరణగా తాజాగా వచ్చిన నేల టికెట్టు చిత్రమే. ఈ లిస్ట్ లో అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, స్పైడర్ లు ముందు వరుసలో ఉంటాయి. ప్రేక్షకులను గ్రాంటెడ్ గా తీసుకున్న యువహీరోల లిస్ట్ చూస్తే నాని చేసిన కృష్ణార్జున యుద్ధం, సాయి ధరమ్ తేజ్ చేసిన గత మూడు నాలుగు సినిమాలు. ఎన్టీఆర్ గతంలో ఇలా చేసే చాలా సినిమాలను బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టించాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశమేంటంటే..కొత్తదనం లేకపోతే..ఎన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ వడ్డించినా ప్రేక్షకులు అంగీకరించడం లేదు. 

రెగ్యులర్ హీరో ఫార్ములాను మార్చేసే కథలు పుట్టుకొస్తున్నాయి. గతేడాది అర్జున్ రెడ్డి నుంచి మొన్న వచ్చిన మహానటి వరకు కంటెంట్ మాత్రమే నడిపించింది. స్టార్ హీరోల సినిమాల ఫార్ములాలు కూడా మారిపోయాయి. మహేష్ బాబు..భరత్ అనే నేను, రామ్ చరణ్..రంగస్థలం చిత్రాల ద్వారా వైవిధ్యతను ప్రదర్శిస్తున్నారు. ఎంత స్టార్ డైరెక్టర్ అయినా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లట్లేదు. కారణం..ట్రైలర్, టీజర్. గత ఏడాది కాలంగా కొత్త దర్శకుల హావా మన ఇండస్ట్రీలో బాగా కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగా, ఘాజీ తీసిన సంకల్ప్ రెడ్డి, తొలిప్రేమ.. వెంకీ అట్లూరి, ఆ!..ప్రశాంత్ వర్మ, గరుడ వేగ..ప్రవీణ్ సత్తారు, మళ్ళీ రావా..గౌతమ్ తిన్నురి, నీది నాది ఒకే కథ..వేణు ఉడుగుల, మహానటి..నాగ్ అశ్విన్ ఇలా అందరు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నారు. 

ఒకప్పుడు మన సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒక కల. కానీ ఇప్పుడు మిలియన్ డాలర్ల వసూళ్లు అలవోకగా వస్తున్నాయి. ఇక్కడి ప్రేక్షకులు అంత స్మార్ట్ అంటే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అయితే ఆ వైపు కూడా చూడట్లేదు. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే. అర్జున్ రెడ్డి సినిమా అక్కడ దాదాపు 2మిలియన్ డాలర్స్ ను వేసేసుకుంది. మొన్న మహానటి కూడా తక్కువేం కాదు ఈ చిత్రం కూడా 2 మిలియన్ పైనే సాధిస్తోంది. మొట్టమొదట తెలుగు వారికి అక్కడ మార్కెట్ ఉందని తెలియజెప్పిన చిత్రం 'అతడు'. మహేష్ బాబు, త్రివిక్రమ్ లు చేసిన సినిమా అప్పట్లో డిఫెరెంట్ సినిమా పేరుపొందింది. ఇప్పటికి ఫ్రెష్ గానే ఉంటుంది ఆ చిత్రం. రంగస్థలం ఎంత ఊర మాస్ ఫిలిం మేకింగో చూసాం. కానీ కథ, సుకుమార్ నడిపిన తీరు ఇవన్నీ ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. మొన్న భరత్ అనే నేను కూడా ఇదే కోవలోకే వస్తుందండోయ్. 

సో ఫైనల్ గా ఏంటంటే ఒకప్పటి మూస ధోరణి సినిమాలను మన ప్రేక్షకులు ఏమాత్రం అంగీకరించట్లేదు. సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్ అన్నింటిలోను వైవిధ్యత ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒకప్పుడు డిఫెరెంట్ సినిమాలంటే కోలీవుడ్ వి మాత్రమే అని చెప్పిన వాళ్ళ నోళ్లు మూయించే సమయం ఎంతో దూరంలో లేదు.