జనరల్ మోటార్స్ సీఎఫ్ఓగా తెలుగు మహిళ

జనరల్ మోటార్స్ సీఎఫ్ఓగా తెలుగు మహిళ

అమెరికాలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) కంపెనీ ఉన్నతస్థాయిలో కొత్త రక్తాన్ని నింపుతోంది. ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తోంది. తాజాగా రెండు అత్యున్నత పదవులకు ఇద్దరు మహిళలను ఎంపిక చేసింది. ప్రస్తుత సీఎఫ్ఓ చక్ స్టీవెన్స్ పదవీ విరమణ చేస్తుండటంతో చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవరను జీఎం సీఎఫ్ఓగా నియమించనుంది. సెప్టెంబర్ 1 నుంచి దివ్య పదవీ బాధ్యతలు చేపడతారు. 

2004లో జీఎం ట్రెజరీ విభాగంలో ప్రవేశించిన దివ్య, కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కీలక స్థానం సాధించారు. 39 ఏళ్ల దివ్య సూర్యదేవర జూలై 2017లో జీఎం కార్పొరేట్ ఫైనాన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. గత 11 నెలల్లో జర్మన్ అనుబంధ సంస్థ, ఒపెల్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యూనిట్ క్రూజ్ ఆటోమేషన్ కొనుగోలు, స్టార్టప్ కంపెనీ లిఫ్ట్ ఇంక్ లో పెట్టుబడులు వంటి నిర్ణయాల్లో దివ్య కీలకపాత్ర పోషించారు. ఇటీవలే ఆమె సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ నుంచి జీఎంకి భారీ పెట్టుబడులు సాధించారు. 

ప్రొమార్క్ గ్లోబల్ అడ్వైజర్స్ ఇంక్ కు చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ గా పనిచేసిన దివ్య, తర్వాత జనరల్ మోటార్స్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ సీఈవో, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. జూలై 2013లో జీఎం అస్సెట్ మేనేజ్ మెంట్ కి చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ గా, ఫిబ్రవరి 2014 నుంచి సీఈవోగా సేవలందించారు. జూలై 2015 నుంచి జూలై 2017 వరకు జనరల్ మోటార్స్ కంపెనీ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా, ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 

తెలుగు మూలాలున్న దివ్య సూర్యదేవర స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి కామర్స్ లో పట్టభద్రురాలయ్యారు. తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అనంతరం ఛార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ (సీఎఫ్ఏ) ధృవీకరణ పొందారు.