థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లోని రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సెగ

థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లోని రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సెగ

దేశంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లోని (దేశీయ బొగ్గు, దిగుమతి చేసుకొన్న బొగ్గు, గ్యాస్ ఆధారిత) రూ.2.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు ఒక నివేదిక తెలిపింది. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకొని నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పునరుద్ధరించాల్సి ఉందని సూచించింది.

అసోచామ్-గ్రాంట్ థాన్టన్ కలిసి దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో ఇటీవల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రంగాల్లో విద్యుత్ రంగం అగ్రస్థానాన ఉన్నట్టు తేలింది. దాదాపుగా రూ.1 లక్ష కోట్లకు పైగా రుణాలు మొండి బకాయిలుగా మారినట్టు గుర్తించింది. బొగ్గు ఆధారిత, గ్యాస్ ఆధారిత, జలవిద్యుత్ ప్రాజెక్టులకు సుమారుగా రూ.3 లక్షల కోట్ల మేర అప్పులు ఇచ్చిన రుణదాతలు ప్రమాదపు అంచున నిలబడినట్టు పేర్కొంది. 

క్రమబద్ధంగా ఇంధన సరఫరా లభ్యత లేకపోవడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లేకపోవడం, ఈక్విటీ, వర్కింగ్ క్యాపిటల్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రమోటర్ల శక్తి చాలకపోవడం, నియంత్రణ-కాంట్రాక్ట్ సంబంధిత అంశాల వంటివి థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని తెలిపింది.