నేడు అనంతలో వైసీపీ సమర శంఖారావం

నేడు అనంతలో వైసీపీ సమర శంఖారావం

తన సుదీర్ఘ పాదయాత్ర తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అనంతపురం జిల్లాకు రానున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర తరువాత జిల్లాకు తొలిసారిగా వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. జగన్ అనంతపురంలో నిర్వహించే సమర శంఖారావం సభ ద్వారా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. 

అనంతపురం శివారులోని హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై అశోక్ లేలాండ్ షోరూం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించనున్న సమర శంఖారావానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ జగన్ వేదికపైనే కాకుండా బూత్ కమిటీ సభ్యుల మధ్యలోకి వచ్చి సంభాషించే విధంగా నాలుగు వైపులా ర్యాంపులను ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల మందికి పైగా జిల్లాలోని బూత్ కమిటీ సభ్యులు, బూత్ కన్వీనర్లు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.