నేడు ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష

నేడు ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష

ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టడానికి సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్షకు దిగనున్నారు. ఏపి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఈరోజు ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 8గంట‌ల వ‌ర‌కు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిసి వినతి పత్రం సమర్పిస్తారు. జాతీయ స్థాయిలో విపక్ష పార్టీల నేతలు ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపనున్నారు. కోల్‌కతాలో మమతా బెనర్జీ చేసిన దీక్షకు చంద్రబాబు హాజరైన నేపథ్యంలో.. ఆమె కూడా చంద్రబాబు దీక్షకు హాజరయ్యే అవకాశముంది. 

ఏపీ ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలోనే ఢిల్లీలో దీక్ష చేసి, దేశ ప్రజల దృష్టి ఆకర్షించవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. తద్వారా ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టవచ్చని ఆయన భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రెండు రైళ్లను ఏర్పాటు చేసి, ఈ దీక్షలో పాల్గొనే వారిని ఢిల్లీకి తీసుకెళ్లింది. పలు పార్టీలు, జేఏసీలు, విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి సంఘాల వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ భవన్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి వచ్చిన వారికి బస ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు.

ఏపీ భవన్‌ ప్రాంగణంలోని వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రులు జవహర్‌, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తదితరులు పర్యవేక్షించారు. టీడీపీ పార్లమెంటరీ నేత సుజనాచౌదరి, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, మాగంటి బాబు, మురళీమోహన్‌, రవీంద్రబాబు, నిమ్మల కిష్టప్ప, కనకమేడల రవీంద్రకుమార్‌, బుట్టారేణుక, రామ్మోహన్‌నాయుడు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులు అధికారులను అడిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు.