నేడు భారత్, కివీస్ మధ్య రెండో టీ20

నేడు భారత్, కివీస్ మధ్య రెండో టీ20

టీ20 సిరీస్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం జరిగే రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఆల్ రైండ్ ప్రదర్శన కనబరిచేందుకు సన్నద్ధమైంది. న్యూజిలాండ్ తో తాడోపేడో తేల్చుకోనుంది. నిజానికి ఈ సిరీస్ లో రిజర్వ్ సత్తాను పరిశీలించాలనుకున్న భారత్ కు తొలి మ్యాచ్ లోనే కఠిన పరీక్ష ఎదురైంది. దీంతో ఇప్పుడు ప్రయోగాలు పక్కనబెట్టి మ్యాచ్ విజయంపైనే దృష్టి పెట్టింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్‌పై కార్తీక్‌, ధోని, హార్దిక్‌ చెలరేగడం భారత్‌కు అవసరం. మరోవైపు తొలి టీ20లో విజయంతో ఈ ఫార్మాట్లో భారత్‌పై రికార్డును మరింత మెరుగుపర్చుకున్న న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో సమరానికి సై అంటోంది. వన్డే సిరీస్ కొల్పోయిన న్యూజిలాండ్ టీ20ల్లో శుభారంభంతో టచ్ లోకి వచ్చింది. భారత్ కు టీ20 చరిత్రలోనే భారీ పరాజయాన్ని రుచి చూపించిన కివీస్ ఇదే జోరుతో మరో మ్యాచ్ మిగిలిఉండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది.

మ్యాచ్‌ వేదిక ఈడెన్‌ పార్క్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. పరుగుల వరద పారే అవకాశముంది. నిరుడు ఇదే వేదికలో ఆస్ట్రేలియా 244 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 10 ఓవర్లలోనే ఛేదించింది. అయినా ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 9 సార్లు గెలిచాయి. ఛేదన జట్లు ఆరు మ్యాచ్‌లు నెగ్గాయి.