ఈ వైరస్‌ మీ క్రెడిట్‌ కార్డు వివరాలు కొట్టేస్తుంది

ఈ వైరస్‌ మీ క్రెడిట్‌ కార్డు వివరాలు కొట్టేస్తుంది

స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని కూర్చున్న చోటి నుంచి కదలకుండా ఆన్ లైన్ బ్యాంకింగ్ లో లావాదేవీలు జరుపుతున్నాం. మొబైల్ బ్యాంకింగ్ తో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. కానీ ఆండ్రాయిడ్ లో కొత్తగా చొరబడిన రెండు అత్యంత ప్రమాదకరమైన మాల్ వేర్ లు.. బ్యాంకింగ్ యాప్స్ ద్వారా దేశంలోని ప్రధాన బ్యాంకులకు చెందిన కస్టమర్ల ఫైనాన్షియల్ డేటా అంతా దొంగిలిస్తున్నాయని ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ, క్విక్ హీల్ గుర్తించింది.

దేశంలో తాజాగా ఆండ్రాయిడ్.మార్చర్.సీ, ఆండ్రాయిడ్.అసకబ్.టీ అనే అతి ప్రమాదకరమైన రెండు బ్యాంకింగ్ ట్రోజాన్లు విస్తరిస్తున్నాయి. ఇవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేశాయి. ఇవి సోషల్ మీడియా యాప్స్ అందించే పేమెంట్ సర్వీసెస్, బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ఫోన్లలోకి చొరబడి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్, ఇతర వివరాలన్నిటినీ తస్కరిస్తుంది. 

సాధారణమైన యాప్ గా కనిపించేందుకు ఆండ్రాయిడ్ మార్చర్ సీ  అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ను ఉపయోగించుకుంటుంది. ఇక ఆండ్రాయిడ్ అసకబ్ టీ అయితే ఏకంగా ఆండ్రాయిడ్ అప్ డేట్ లోగోనే తగిలించుకుంటుంది. ఇవి రెండూ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ దాటుకుని ఒక ఫేక్ విండో సృష్టిస్తాయి. అందులో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు అడుగుతాయి. రెండు బ్యాంకింగ్ ట్రోజాన్లు సాధారణంగా అన్ లైన్ ట్రాన్సాక్షన్లలో వచ్చే రెండు రకాల ఆథెంటికేషన్ ను తప్పించుకుంటాయి. 

కొత్త మాల్ వేర్ లు తాము కోరినట్టు కార్డు వివరాలు ఇచ్చే వరకు పదేపదే వస్తూ మిగతా యాప్స్ వాడకాన్ని అడ్డుకుంటాయి. ఆండ్రాయిడ్ మార్చర్ సీ సోషల్ మీడియా, బ్యాంకింగ్ సర్వీసెస్ ను టార్గెట్ చేస్తే ఆండ్రాయిడ్ అసకబ్ టీ ఫేక్ విండో ద్వారా పేమెంట్ గేట్ వే తెరుస్తుంది. యూజర్ ఆండ్రాయిడ్ తెరిచేలా చేస్తుంది. ఇవి ఫోన్ లోని మెసేజెస్, కాంటాక్ట్ ఇన్ఫో, ఎక్కువగా వాడే యాప్స్ అన్నిటిలోకి చొరబడి వ్యక్తిగత వివరాలు కూడా సేకరిస్తాయి.

దీంతో యూజర్లు అనుమానాస్పద మెసేజ్ లు, లింకులు ఓపెన్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ పరిశీలించిన యాప్స్ మాత్రమే వాడాలని చెబుతున్నారు.