ఎంఐఎం, బీజేపీకి కేసీఆర్ ఏజెంట్: షబ్బీర్ అలీ

ఎంఐఎం, బీజేపీకి కేసీఆర్ ఏజెంట్: షబ్బీర్ అలీ

సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ గర్జన సభ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలువురు నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ కు మైనార్టీల పట్ల ప్రేమ ఉంటే 12 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, అమాయక నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆజాద్ పర్యటనను విఫలం చేసేందుకు జగ్గారెడ్డి అరెస్ట్ చేశారని  అన్నారు. కాంగ్రెస్ కల్పించిన 4శాతం మైనార్టీ రిజర్వేషన్లతో 20లక్షల మంది విద్యార్ధులు లాభపడ్డారని షబ్బీర్ అలీ తెలిపారు.

కేసీఆర్ గల్ఫ్ దేశాలకు మనుషులను పంపించే ఏజెంట్ గా వృత్తిని ప్రారంభించారని ఆరోపించారు. మొదటి నిందితుడైన కేసీఆర్ ను అరెస్ట్ చేసే దైర్యం పోలీసులకు ఉందా అని ఘాటుగా ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయి శోకసంద్రంలో ఉంటే కేసీఆర్ ఇతర పార్టీల నాయకుల చేరికపై సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంఐఎంకు, కేంద్రంలో బీజేపీకి కేసీఆర్ ఏజెంట్ అని ఆయన విమర్శించారు. తెలంగాణ అమరవీరులకు స్మారక స్థూపం కట్టించకుండా తెలంగాణ ద్రోహి అయిన హరికృష్ణకు మోమొరియల్ కడతావా అని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు.