ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు...

ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు...

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పగటి కలలు కంటున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు. టీడీపీకి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారన్నారు. విభజన హామీల అమలు కోసం టీఆర్ఎస్ ఎప్పట్నుంచో అడుగుతోందని తెలిపారు. మా మంత్రి హరీశ్ రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానమిచ్చారన్నారని ఎద్దేవా చేశారు. నదీ జలాల పంపకంపై ఉత్తమ్ కు కనీస అవగాహన లేదని తేలిపోయిందన్నారు. సైన్యంలో కెప్టెన్ గా పనిచేశానని చెప్పుకునే ఉత్తమ్ కు కనీస పరిజ్ఞానం లేదని కర్నె ప్రభాకర్ విమర్శించారు.

నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి అపెక్స్ బాడీ ఉంది. ఆ అపెక్స్ బాడీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. అయినా ఉత్తమ్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికాడు అని కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు.. ఉత్తమ్ దాన్ని సమర్దిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ అవివేకిలా, చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్ లేఖకు స్పందిస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వవస్తుందని టీఆర్ఎస్ నిర్ధారించిందని అడ్డగోలుగా ఉత్తమ్ మాట్లాడారు, ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు అని అయన అన్నారు. చంద్రబాబు ఎజెండానే కాంగ్రెస్ ఎజెండా అని ఉత్తమ్  చెప్పకనే చెప్పారు అని అన్నారు.