ఎన్నికలకు సంబంధం లేదు: కర్నె

ఎన్నికలకు సంబంధం లేదు: కర్నె

అవినీతి కేసులకు ఎన్నికలకు సంబంధం లేదు అని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డిలకు అజ్ఞానం మూర్తీభవించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వారు అవగాహనా రాహిత్యంతో మాట్లాడారు అని అన్నారు. ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తవుతుండడంతో.. కాంగ్రెస్‌ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను టూరిజం స్పాట్‌గా మార్చారని జీవన్‌రెడ్డి హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. జీవన్ రెడ్డి కళ్ళకు పొరలు కమ్మినట్టు ఉన్నాయి అని విమర్శించారు. ఆయనది జగిత్యాలలో ఓ మాట, హైదరాబాద్ లో మరోమాట.. ద్వంద్వ నీతితో ఆయన ముందుకెళుతున్నారు అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాలకతీతంగా అందరూ పొగుడుతుంటే కాంగ్రెస్ నేతలకు కడుపుమంటగా ఉందని అన్నారు.

కాంగ్రెస్ హాయంలో సాగునీటి ప్రాజెక్టులు ఎడారులు.. కానీ ఇపుడు ప్రాజెక్టులు దేవాలయాలు అని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టులపై ఎందుకు ఒప్పందాలు చేసుకోలేదు అని విమర్శించారు. జీవన్ రెడ్డి సాగునీటి రంగంపై అవగాహన పెంచుకుని మాట్లాడితే మంచిది అని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హాయంలో పూర్తయి ఉంటే.. రైతుల ఆత్మహత్యలు తగ్గి ఉండేవి అని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు తమ ధోరణి మార్చుకోకుంటే.. వారికి రాజకీయంగా చీకటి రోజులు తప్పవు అని అన్నారు. పాస్ పుస్తకాలపై ఉత్తమ్ చేసిన ఆరోపణల్లో పసలేదు, పాస్ బుక్కులను పకడ్బందీగా రూపొందించి రైతులకు అందజేస్తున్నాం అని అన్నారు. ఓటుకు నోటు కేసు ఒక అవినీతికి సంబంధించినది. ఏ పనిని ఎప్పుడు చేయాలో అధికారులకు తెలుసు.. ఆ పనిని సరియైన సమయంలో చేయడం లేదన్న భావనలో ముఖ్యమంత్రి వేగవంతం చేయండని  అన్నారు. ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరం కాలం ఉంది. అవినీతి కేసులకు ఎన్నికలకు అసలు సంబంధం లేదు అని అన్నారు.