గెలుపులో నిరంతర విద్యుత్ పాత్ర ఉంది

గెలుపులో నిరంతర విద్యుత్ పాత్ర ఉంది

టీఆర్ఎస్ గెలుపులో నిరంతర విద్యుత్ పాత్ర ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మింట్ కాంపౌండ్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) 12వ ఆవిర్భావ ఉత్సవాలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఈఈఏ 2019-డైరీ, క్యాలెండర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ... ఇక్కడికి పరిశ్రమలు స్థాపించడానికి వచ్చేవాళ్లు కరెంట్ గురించే అడుగుతారు. ఉమ్మడి ఏపీలో వారానికి మూడు రోజులు పవర్ హాలీడే ప్రకటించారు. కరెంట్ కోసం పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేశారు. సీఎం కేసీఆర్, ట్రాన్స్ కో సీఎండీ, విద్యుత్ శాఖ ఉద్యోగుల సమిష్టి కృషితోనే 24 గంటల విద్యుత్ సాధ్యమైంది. ఇపుడు నాణ్యమైన, నిరంతరాయ కరెంట్ ను అందించగలుగుతున్నామని కేటీఆర్ తెలిపారు. దేశంలో వ్యవసాయంకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో పెను సవాళ్లు ఉన్నది వాస్తవం. సవాళ్ళనును మనం అవకాశంగా తీసుకోవాలి. చాలా రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రైవేటు పరం చేశారు. ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపనీలతో మనం పోటీ పడాలి. స్మార్ట్ మీటరింగ్ వైపు మనం పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో రెండు మూడు ఏళ్లలో తెలంగాణ కోటి ఎకరాల మాగణం అవుతుంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను విద్యుత్ ఉద్యోగులతో పోటీ పడవద్దని కేసీఆర్ చెప్పారు. విద్యుత్ ఇంజనీర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతాం. ప్రైవేట్ డిస్కోమ్ లను తలదన్నేలా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.