ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు

ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు

ఫిట్ నెస్ లేని ఓ ఆర్టీసీ బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. ప్రయాణీకుల హాహాకారాలు, ఆర్తనాదాలు చేసినా.. బస్సు డ్రైవర్ పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్ లో  చేటుచేసుకుంది. 49 మంది ప్రయాణీకులతో సంగారెడ్డి డిపోకు చెందిన TS 15 Z 0155 నెంబరు గల ఆర్టీసీ బస్సు లింగంపల్లి నుంచి విజయవాడకు రాత్రి పదకొండు గంటల సమయంలో బయల్థేరింది. హైదరాబాద్ మూసాపేట్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి.

బస్సు అటూ ఇటూ కుదుపులకు గురైంది. ఏమవుతుందోనన్న ఆందోళన ప్రయాణీకుల్లో పెరిగింది. బస్సును ఆపేయండి.. కాపాడండి అంటూ ప్రయాణీకులు హాహాకారాలు, ఆర్తనాదాలు చేసినా.. బస్సు డ్రైవర్ ఉస్మాన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్లాడు. దాంతో ప్రయాణీకులు బిగ్గరగా కేకలు వేయడంతో డ్రైవర్ బ్రిడ్జిపై బస్సును నిలిపేశాడు. కిందకి దిగి చూడగా.. బస్సు వెనుక వైపున రెండు చక్రాలు పక్కకు ఒరిగిపోయి.. బోల్టులు ఊడిపోయి.. నట్లు విరిగిపోయి ఉన్నాయి. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రిడ్జిపై నుంచి బస్సు అమాంతంగా కిందకు పడిపోతుందేమోనని భయాందోళనకు గురయ్యామని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని ప్రయాణీకులు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేయాలని కోరినా.. సిబ్బంది పట్టించుకోలేదని, అధికారుల దృష్టికి తామే తీసుకెళ్లామని ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు రాత్రి 2 గంటల సమయంలో మరో బస్సును ఏర్పాటు చేయడంతో.. ప్రయాణీకులు విజయవాడకు బయల్థేరారు.