సమ్మెబాటలో టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు

సమ్మెబాటలో టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ చలో బస్‌ భవన్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21 తరువాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని చెప్పారు. టీఎంయూ మీటింగ్‌ ఓ శాంపిల్‌ మాత్రమేనన్నారు. కార్మిక లోకం కన్నెర్ర చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారంటే అది అర్టీసీ కార్మికుల చలువేనన్నారు.

చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా  చేపట్టిన బస్‌భవన్‌ ముట్టడికి  పెద్ద ఎత్తున స్పందన కనిపించిందన్నారు. కార్మికుల పే స్కేలు సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, సిబ్బంది ఎదుర్కొంటున్న శాశ్వత సమస్యలు పరిష్కరించాలని అశ్వద్ధామ రెడ్డి డిమాండ్‌ చేశారు. లిఖిత పూర్వక హామీ ఇస్తేనే సమ్మె ఆలోచనను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.