కొండగట్టు బాధితులను ఆదుకోవాలి: ఎల్. రమణ

కొండగట్టు బాధితులను ఆదుకోవాలి: ఎల్. రమణ

కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో 61 మంది చనిపోవడం దురదృష్టకరమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులు తగ్గారని.. అధికారులు భక్తులను కలుపుకుని ఘాట్ రోడ్డు పై బస్సును నడిపించారని ఆరోపించారు. 

నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో ఆర్టీసీ సంస్థను నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగితే కేసీఆర్ ఫాంహౌస్ లో కూర్చోని సమీక్షాడా? అని ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని, బాధితులకు అండగా నిలబడకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఎల్. రమణ హెచ్చరించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొండగట్టు బాధితులకు రూ.50 లక్షలు నష్టపరిహారం అందిస్తామని, దీనిపై తొలి జీవో జారీ చేస్తామని అన్నారు. రాష్ట్రం మొత్తం విషాద వాతావరణం చోటు చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రమణ మండిపడ్డారు.