ఎన్నికలపై టీటీడీపీ సమాయిత్తం

ఎన్నికలపై టీటీడీపీ సమాయిత్తం

తెలంగాణలో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని  నిర్ణయించినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రెండు విడతలుగా జిల్లాల అధ్యక్షులతో సమావేశం జరిగిందని వివరించారు.తెలంగాణా లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించామని చెప్పుకొచ్చారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని రావుల అన్నారు. తెలంగాణలో టీడీపీకి  8 లక్షల సభ్యత్వం ఉందన్నారు. పంచాయితీ ఎన్నికల్లో స్థానిక సర్దుబాట్ల వల్ల, తమ మద్దతుతో గణనీయ సంఖ్యలో సర్పంచులు గెలిచారని పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. 

తెలంగాణా లో వన్ ప్లస్ వన్ ప్రభుత్వం నడుస్తోందని రావుల విమర్శించారు.బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్, వైసీపీలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రం పెత్తనం పై మాట్లాడిన కేసీఆర్ ..మమతా బెనర్జీ విషయంలో మౌనంగా ఎందుకున్నారని నిలదీసారు. టీటీడీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై చర్చించినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల తెలిపారు. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలనే దానిపై జిల్లా అధ్యక్షులను నివేదిక ఇవ్వాలని.. పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ, పొత్తుల పై చంద్రబాబుదే తుది నిర్ణయమని స్పష్టం చేసారు.