అనిల్‌ అంబానీకి మోడీ మధ్యవర్తి

అనిల్‌ అంబానీకి మోడీ మధ్యవర్తి

రఫేల్ డీల్ వ్యవహారంలో  అనిల్‌ అంబానీకి ప్రధాని మోడీ మ‌ధ్యవ‌ర్తిగా ప‌నిచేశార‌ని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై రాహుల్ ఇవాళ మ‌రికొన్ని విష‌యాలు వెల్లడించారు. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోదీ అవినీతికి పాల్పడిన‌ట్లు ఆరోపించారు.  ఫ్రాన్స్ ర‌క్షణ మంత్రిత్వశాఖ అధికారులతో రఫేల్ ప్రకటన కంటే రెండు వారాల ముందే అనిల్ అంబానీ భేటీ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆయన ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రిని కూడా కలిశారని తెలిపారు. ప్రధాని మోదీ విజిట్ క‌న్నా ముందే.. అనిల్  అంబానీ ఎలా ఫ్రాన్స్ ర‌క్షణ‌మంత్రితో భేటీ అవుతార‌ని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ ఈ మెయిల్‌ను కాంగ్రెస్ నేత బ‌య‌ట‌పెట్టారు. 

2015 ఏప్రెల్ 9-11 వరకు ప్రధాని మోడీ అధికారిక పర్యటన జరిగిందని గుర్తు చేశారు. రాఫెల్ ఒప్పందంలో త‌న స్నేహితుడు అనిల్ అంబానీకి ప్రధాని మోడీ హెల్ప్ చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు. దేశ ప్రజ‌ల‌కు చెందిన సుమారు 30 వేల కోట్ల డ‌బ్బును మోడీ దొంగ‌లించార‌ని ఆరోపించారు. ఇప్పటికే రాఫెల్ డీల్‌పై  ద హిందూ కొన్ని సంచ‌ల‌నాత్మక అంశాల‌ను వెల్లడించింది. ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందంపై పీఎంవో దొడ్డిదారిలో చ‌ర్చలు జ‌రిపిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దేశ భద్రతను ప్రధాని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని మరోసారి డిమాండ్‌ చేశారు.