నీ కిడ్నీ మావారికి..నా కిడ్నీ మీవారికి

నీ కిడ్నీ మావారికి..నా కిడ్నీ మీవారికి

భర్తకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోసే మహిళలను చాలా మందినే చూసుంటారు. కానీ.. భర్త ప్రాణాలు కాపాడడం కోసం వేరొకరి భర్తకు కిడ్నీ ఇచ్చిన మహిళను ఇంతవరకూ చూశారా? అయితే.. మీరు ఈ ఇద్దరు మహిళల గురించి తెలుసుకోవాల్సిందే! 
సింగరేణి కాలరీస్‌ ఉద్యోగి బిల్ల మల్లయ్య జన్యు సంబంధ కిడ్నీల సమస్యతో బాధపడుతుండడంతో కిడ్నీ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కార మని డెక్కన్‌ ఆస్పత్రి వైద్యులు సూచించారు. మల్లయ్యకు కిడ్నీ ఇవ్వడానికి భార్య పద్మ అంగీకరించినా బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచ్‌ కాకపోవడం చికిత్సకు అడ్డంకిగా మారింది. కిమ్స్‌లో కరీంనగర్‌కు చెందిన రాజు కూడా ఇటువంటి సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీ ఇవ్వడానికి ఆయన భార్య సునీత ముందుకొచ్చినా బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచవలేదు. దీంతో..  సునీత నుంచి సేకరించిన కిడ్నీని డెక్కన్‌ ఆస్పత్రిలోని మల్లయ్యకు అమర్చగా, పద్మ నుంచి సేకరించిన కిడ్నీని బానోతు రాజుకు కిమ్స్‌ ఆస్పత్రిలో 'స్వాప్‌' పద్ధతిలో విజయవంతంగా అమర్చారు. జీవన్‌ధాన్‌ అనుమతితో నిర్వహించిన ఈ కిడ్నీల మార్పిడి ప్రక్రియకు ఆరు నెలలు పట్టింది.