నోట్ల రద్దుతో ఎన్ని లాభాలో

నోట్ల రద్దుతో ఎన్ని లాభాలో

పెద్దనోట్లను రద్దు చేసి ఇవాళ్టికి రెండేళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు నేటికీ తూర్పారబడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రధానమంత్రి దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి తమ ప్రభుత్వ నిర్ణయాన్ని బలంగా సమర్థించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8 అర్థరాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడానికి గల కారణాలను అరుణ్ జైట్లీ తన ఫేస్ బుక్ పోస్టులో వివరించారు. డ‌బ్బును స్వాధీనం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో నోట్ల ర‌ద్దు చేప‌ట్టలేద‌న్నారు. అక్రమంగా దాచుకున్న సొమ్మును ఆర్థిక వ్యవ‌స్థలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో డిమానిటైజేష‌న్ చేప‌ట్టిన‌ట్లు జైట్లీ తెలిపారు. ఆర్థిక వ్యవ‌స్థను పట్టాలపైకి ఎక్కించేందుకు తీసుకున్న నిర్ణయాల్లో పెద్దనోట్ల రద్దు ఒక‌టని జైట్లీ అన్నారు. దేశం బ‌య‌ట ఉన్న న‌ల్లధ‌నాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసింద‌ని, జ‌రిమానా ప‌న్ను క‌ట్టి, ఆ సొమ్మును తీసుకొచ్చే విధంగా చ‌ర్యలు తీసుకున్నట్టు తెలిపారు. న‌ల్లధ‌నాన్ని బయటికి తీయని వారిపై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. విదేశాల్లో ఖాతాలు ఉన్నవారిని ప్రశ్నిస్తున్నామ‌న్నారు. అక్రమంగా నిలవ చేసిన డ‌బ్బును.. నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల‌కు వ‌చ్చే విధంగా చేశామ‌ని చెప్పారు. సుమారు 17.42 ల‌క్ష అక్రమ అకౌంట్లు గుర్తించినట్టు తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, ప‌న్ను ఎగ‌వేసిన వారిని శిక్షించామ‌ని వివరించారు. డిపాజిట్లు పెర‌గ‌డం వ‌ల్ల బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నాయ‌న్నారు. అక్రమ డ‌బ్బు చాలావ‌ర‌కు మ్యూచువ‌ల్ ఫండ్స్ రూపంలో పెట్టుబ‌డిగా వచ్చిందన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్సరంలో ప‌ర్సన‌ల్ ఇన్‌కం ట్యాక్స్ రాబ‌డి పెరిగింద‌ని గుర్తు చేశారు.