తెలంగాణలో అకాల వర్ష బీభత్సం

తెలంగాణలో అకాల వర్ష బీభత్సం

తెలంగాణలో ఆకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈదురు గాలుల బీభత్సానికి నెక్లెస్‌ రోడ్డుపై చెట్టు విరిగిపడింది. దీంతో కారు, ఆటో, రెండు ద్విచక్రవాహనాలు ధ్వసంమయ్యాయి. ఆరాంఘర్‌లో వర్షానికి ప్రహరీగోడ పక్కన నిలబడిన వారిపై గోడకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతిచెందారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో కూడా చెట్లు కూలాయి. మరోచోట బస్‌ షల్టర్‌ ఒరిగిపోయింది. విరిగిపడిన చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు తొలగిస్తున్నారు.

అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులుతో కూడిన వర్షంతో పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. గాలుల బీభత్సానికి మామిడిపండ్లు నేలరాలింది. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గాలికి ప్లాట్‌ఫాం రేకులు ఎగిరిపడ్డాయి. వరంగల్‌, నర్సంపేట, ములుగు రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరకాలలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. జనగామ జిల్లాలోని నర్మెట్ట, తరిగొప్పులలో వడగండ్ల వానకు వరిచేను దెబ్బతింది.