ముగ్గురు తెలుగువారిపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు

ముగ్గురు తెలుగువారిపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు

ఓ భారతీయ ఐటీ కాంట్రాక్టర్, అతని భార్య, తండ్రి ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని అమెరికా అభియోగం మోపింది. ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ సింగపూర్ బ్రాంచ్ లో పనిచేస్తూ తన భార్య, తండ్రికి క్లైంట్లకి సంబంధించిన రహస్య సమాచారాన్ని అక్రమంగా అందజేశాడని ఆరోపించింది. 

రాజేశ్వర్ గన్నమనేని (36) విలీనాలు, సముపార్జన, టెండర్ ఆఫర్ల గురించి బహిరంగ పరచకూడని సమాచారాన్ని తన భార్య దీప్తి గండ్ర (33), భారత్ లో నివసించే తన తండ్రి లింగారావు గన్నమనేని (68)కి అక్రమంగా అందజేసినట్టు ది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అక్రమ ట్రేడింగ్ లో ఉపయోగించిన మూడు యుఎస్ బ్రోకరేజీ ఖాతాలు, ఒక యుఎస్ బ్యాంక్ ఖాతాలలోని ఆస్తులను స్తంభింపజేయాలని ఎస్ఈసీ కోర్టు ఉత్తర్వులు సంపాదించింది. 

డిసెంబర్ 2013 ఆగస్ట్ 2016 మధ్య కాలంలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ లో ఒక సీనియర్ సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ గా ఉన్న రాజేశ్వర్ తన పదవిని దుర్వినియోగ పరిచాడు.  ఆ బ్యాంకు క్లైంట్ల గురించి కనీసం 40 విలీనాలు, సముపార్జనలు, టెండర్ ఆఫర్లు, ఇతర ముఖ్యమైన కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన, ఎంతో గోప్యమైన సమాచారాన్ని సాధించాడు. ఆ సమాచారాన్ని అక్రమంగా అమ్ముకోవడంతో పాటు ఆ సమాచారం ఆధారంగా తన తండ్రి, భార్యలతో చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేయించాడు. ఇలా అడ్డదారిలో సుమారు 6,00,000 డాలర్లకు పైగా లాభాలు ఆర్జించాడు.

ఇంతే కాకుండా రాజేశ్వర్ అప్పుడు అమెరికాలో నివసిస్తున్న తన కుటుంబ సభ్యులు ఒకరి పేరిట అకౌంట్ తెరిచి దాని ద్వారా ట్రేడింగ్ జరిపినట్టు అభియోగం మోపారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న తన కజిన్ ను ఒక అమెరికా బ్రోకరేజ్ సంస్థ దగ్గర ఇన్వెస్ట్ మెంట్ అకౌంట్ తెరవాల్సిందిగా రాజేశ్వర్ గన్నమనేని సూచించాడు. సింగపూర్ నుంచి ఆ అకౌంట్ లో తన ట్రేడింగ్ చేస్తూ వచ్చాడు. ఎస్ఈసీ ఫిర్యాదులో ఈ ముగ్గురిపై మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్రమ పద్ధతుల్ల్లో సంపాదించిన లాభాలు, ముందుగానే సమాచార సేకరణ, జరిమానాలు వంటివి వసూలు చేయాలని కోరింది.